గిరిజనులకు రూ.5కే ప్లేట్​ మీల్స్​

గిరిజనులకు రూ.5కే ప్లేట్​ మీల్స్​

ఉట్నూర్, వెలుగు :  ఆదివాసీ, గిరిజనులకు రూ.5 కే భోజనాన్ని అందించనున్నట్టు ఉమ్మడి అదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం ఆమె ఉట్నూరులోని గిరిజన భవన్​లో గిరిజన క్యాంటిన్​ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు, గిరిజనులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గిరిజన క్యాంటిన్​ద్వారా కొంతమంది కోలాం గిరిజనులకు ఉపాధి లభిస్తోందన్నారు. గిరిజన క్యాంటిన్​లో రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు రూ.5కే ప్లేట్​ భోజనం లభిస్తుందన్నారు. ఆయా పనులకోసం మండల కేంద్రానికి వచ్చేవాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్యాంటిన్​ శాశ్వత షెడ్డు కోసం టెండర్లు పిలవాలని అధికారులను అదేశించారు. 

అగ్రగామిగా ఆదిలాబాద్​

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు ఒక్క జట్టుగా పని చేయాలని సీతక్క అన్నారు. శుక్రవారం ఉట్నూరులోని కుమ్రం భీం ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. ఖానాపూర్​ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్​, ఆదిలాబాద్, నిర్మల్​, మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, ఆశీశ్ సాంగ్వాన్​, సంతోష్​, వెంకటేశ్​ దొత్రో, నాలుగు జిల్లాల ఏస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన జిల్లా అనే పేరును రూపుమాపాలన్నారు. వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో కలుషిత నీటిని వాడడంవల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. గంజాయి, డ్రగ్స్​వల్ల దుష్ఫలితాలపై యువతకు అవగాహన కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తోందన్నారు. పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.