వారం రోజులుగా మేడారంలోనే ..అన్నీతానై చూసుకున్న మంత్రి సీతక్క

వారం రోజులుగా మేడారంలోనే ..అన్నీతానై  చూసుకున్న మంత్రి సీతక్క

మేడారం (జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి), వెలుగు:  రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతర విజయవంతమైంది. ఎన్నడూ లేనిది జాతర చివరి రోజు కూడా లక్షలాది మంది తరలివచ్చారు. అమ్మలను దర్శించుకొని ఇంటిబాటపట్టారు. జాతర సక్సెస్​ కావడం వెనుక మంత్రి సీతక్క కృషి దాగి ఉంది. వారం రోజులుగా మేడారంలోనే ఉంటూ.. ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ఆమె ముందుకు సాగారు. పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లతో పాటు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌, ఐజీ, ఎస్పీ వంటి ఉన్నతాధికారులను కలుపుకొని జాతర ఏర్పాట్లు చూశారు. 

తన నియోజకవర్గం కూడా కావడంతో..!

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క, దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ పనిచేస్తున్నారు. మేడారం మహాజాతర ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పరిధిలోకే వస్తుండటంతో ఈ ఇద్దరు మంత్రులు జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండే. కానీ, కొండా సురేఖ అనారోగ్యం బారినపడటంతో సీతక్కనే అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. పైగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోనే మేడారం ఉండటంతో సీతక్క దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులకే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరికి వెళ్లి మేడారం జాతర కోసం రూ. 105 కోట్ల నిధులు తీసుకురావడం, టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడం వరకు అన్నీ మంత్రి సీతక్క చూసుకున్నారు. అతితక్కువ టైమ్​లోనే పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయించారు. ఇందుకోసం రెండు నెలల్లో 12 సార్లు మేడారం వచ్చి పనులు పర్యవేక్షించడంతో పాటు ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మంత్రి సీతక్క రివ్యూలు జరిపారు. 

వారం రోజులుగా మేడారంలోనే ఉండి..

మేడారం మహాజాతర ఈ నెల 21న సారలమ్మ రాకతో ప్రారంభమవుతుంది. అయినా రెండు రోజుల ముందే సీతక్క మేడారం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ శబరీశ్‌‌‌‌‌‌‌‌, ఇతర నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో పాటు సెక్టార్‌‌‌‌‌‌‌‌ అధికారులతో సమావేశం పెట్టి జాతర ఏర్పాట్లపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులనుద్దేశించి ప్రతీ రోజు మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి మంత్రి మాట్లాడారు. బుధవారం సారలమ్మ రాక సందర్భంగా మంత్రి  హోదాలో కన్నెపల్లికి వెళ్లి సారలమ్మకు స్వాగతం పలికారు. గతంలో ఏ మంత్రి చేయని పనిని చేసి ఆదివాసీ బిడ్డగా ప్రశంసలందుకున్నారు. గురువారం సమ్మక్కను తీసుకురావడానికి స్వయంగా చిలుకలగుట్ట వద్దకు మంత్రి సీతక్క వెళ్లారు. గుట్టపై నుంచి కుంకుమ భరిణె రూపంలో తీసుకొస్తున్న అమ్మవారికి స్వాగతం పలికారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించగానే తొలి మొక్కులు సమర్పించారు. ఈ సారి గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై‌‌‌‌తో పాటు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అర్జున్‌‌‌‌‌‌‌‌ ముండా మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వీరందరికి సీతక్క మంత్రి హోదాలో పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవార్ల దర్శనం చేయించి తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు పంపించారు. 

ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటం

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కేబినెట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో మేడారం మహాజాతర జరగడం ఇది తొలిసారి. ఏషియా లోనే కాదు ప్రపంచం లోనే అతి తక్కువ విస్తీర్ణంలో జరిగే అతి పెద్ద జాతర ఇది. గత ప్రభుత్వ హయాంలోనే వరదల మూలంగా మేడారం రోడ్లు, భవనాలు మునిగిపోయాయి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ టైంలో వాటికి రిపేర్లు చేయించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశాం. శనివారం నాటికే కోటి 40 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర 20 శాఖల అధికారులు జాతర ఏర్పాట్ల కోసం ఎంతో కష్టపడ్డారు. వీరితో పాటు వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చెరవేసిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సారి జాతరలో ఏవైనా లోటుపాట్లు ఉంటే స్వీకరించి రాబోయే జాతరలోగా సరి చేసుకుంటాం.
- మీడియా సమావేశంలోమంత్రి సీతక్క