
ములుగు, వెలుగు : పేదల సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. ములుగులోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం గోవిందరావుపేట మండలం మొట్లగూడెంలో రాండ్ స్టడ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, సయోధ్య హోం ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య నిర్వహించనున్న ప్లేట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ములుగు అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపీడీవో రామకృష్ణ, ఎఫ్‌డీవో రమేశ్, ఎఫ్‌ఆర్‌వో అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రి
తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మను శుక్రవారం మంత్రి సీతక్క దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. జాతరకు కావాల్సిన నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మంత్రి వెంట ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, తహసీల్దార్ సురేశ్‌బాబు, ఈవో వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.