ఫేక్ అటెండెన్స్ పెట్టిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు : మంత్రి సీతక్క

ఫేక్ అటెండెన్స్ పెట్టిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు : మంత్రి సీతక్క
  • అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం నకిలీ హాజరుపై సీరియస్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ పై మంత్రి సీతక్క సీరియస్  అయ్యారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించకుండా, ఫేక్  అటెండెన్స్ తో పని చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి సీతక్క గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విధానాల ప్రకారం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే మొబైల్  ఫేషియల్  రికగ్నిషన్  యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలి. కానీ, కొంతమంది కార్యదర్శులు ఇతరుల సహాయంతో, లేదా తమ మొబైల్  ఫోన్లను మల్టీపర్పస్ వర్కర్లకు ఇచ్చి, తాము లేకుండానే యాప్  ద్వారా హాజరు నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఏకంగా తమ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్  ఫొటోలను వాడి హాజరు నమోదు చేసిన ఉదంతాలూ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కొన్నిచోట్ల ఖాళీ కుర్చీలను ఫొటో తీసి అటెండెన్స్ యాప్ లో అప్ లోడ్  చేశారు. జిల్లాల వారీగా పదుల సంఖ్యలో ఇలాంటి ఫేక్  హాజరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న కొంతమందితో మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదని పంచాయతీ కార్యదర్శుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫేక్  అటెండెన్స్  వేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. 

దీనిపై వెంటనే స్పందించిన అధికారులు.. సంబంధిత జిల్లాల డీపీఓలకు ఆ ఉద్యోగులపై సస్పెన్షన్  విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లకు నివేదికలు పంపించి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఫేక్  అటెండెన్స్  పెట్టిన పంచాయతీ కార్యదర్శులు, పర్యవేక్షించకుండా వదిలేస్తున్న అధికారులపై మంత్రి సీతక్క ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్  రూరల్  డెవలప్ మెంట్  డైరెక్టర్  సృజన.. డీపీఓలను ఆదేశించారు.