నాణ్యమైన విద్య, మెరుగైన వసతి కల్పించాలి : మంత్రి సీతక్క

నాణ్యమైన విద్య, మెరుగైన వసతి కల్పించాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పాఠశాలలు, వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్​ నుంచి టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించి ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అడిషనల్​ కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, ఎం.సంపత్ రావుతో కలిసి స్కూల్స్, గురుకులాలు, కస్తూర్బాలు, వసతి గృహాల పునఃప్రారంభంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

వర్షాకాలం దృష్ట్యా పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ కోసం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నమస్కారం - మన సంస్కారం అనే భావనను విద్యార్థుల్లో పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాల, వసతి గృహాన్ని అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, ఆర్‌‌‌‌వో ప్లాంట్ల పనితీరు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.