- రామప్ప ఐలాండ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క చెప్పారు. వెంకటాపూర్ మండలంలోని పాలంపేట రామప్ప సరస్సులో రూ.13 కోట్ల నిధులతో చేపట్టిన ఐల్యాండ్ అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... చెరువు మధ్యలో 20 ఎకరాల స్థలం ఉండగా.. ఏడు ఎకరాలల్లో టూరిజం శాఖ ఐలాండ్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రామప్ప సరస్సుకు ఎంత నీరు వచ్చినా ఇబ్బందులు కలవకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. రామప్ప ఆలయ సమీపంలో ఆడిటోరియం నిర్మాణం పూర్తి కావడమే కాకుండా, ఆలయాల పునరుద్ధరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, టూరిజం, ఇంజనీరింగ్ డీఈ ధన్‌రాజ్, ఏఈ విజయ్, తహసీల్దార్ గిరిబాబు పాల్గొన్నారు.
