అంగన్​వాడీల్లో నాసిరకం సరుకులు సప్లై చేస్తే కఠిన చర్యలు: సీతక్క

అంగన్​వాడీల్లో నాసిరకం సరుకులు  సప్లై చేస్తే కఠిన చర్యలు: సీతక్క
  • ఫ్లయింగ్ స్క్వాడ్​తో చెకింగ్స్: మంత్రి సీతక్క
  • టెండర్ల నిబంధనలు కఠినతరం చేస్తామని వెల్లడి
  • మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాలకు నాసిరకం నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. కొన్ని సెంటర్లలో నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరుకుల క్వాలిటీని చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియెట్​లో సోమవారం అంగన్​వాడీ కేంద్రాల పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ‘‘అంగన్​వాడీ సెంటర్లకు నాసిరకం గుడ్లు, వస్తువులు వస్తే నిర్వాహకులు వాటిని తీసుకోవద్దు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేయాలి. అలా చేయకపోతే అంగన్​వాడీ టీచర్లు, స్థానిక సిబ్బందే బాధ్యులు అవుతారు. సరుకుల క్వాలిటీ చెక్ చేసేందుకు టెక్నాలజీ ఉపయోగించాలి. సరుకుల సప్లై కాంట్రాక్ట్​ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్లకు పొడిగించడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నరు. అందుకే, కాంట్రాక్టుల గడువు తగ్గించే ఆలోచనలో ఉన్నం. టెండర్ల నిబంధనలు కఠినతరం చేస్తం. పారదర్శకత కోసం ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటాం’’అని అన్నారు. 

మ్యాచింగ్ గ్రాండ్ల వివరాలు ఇవ్వండి

పథకాల వారీగా పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా.. తమ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ల కోసం అవసరమైన నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)పై ఆమె రివ్యూ చేశారు. సెర్ఫ్ ద్వారా అమలవుతున్న పథకాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో చాలా వరకు కేంద్ర నిధులు సరిగ్గా వాడుకోలేకపోయామన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను వినియోగించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. అభయహస్తం వంటి స్కీమ్​లు అమలు చేయకుండా గత ప్రభుత్వం మహిళల పొదుపు సొమ్ము వందల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిందని అన్నారు.

చిన్నారిపై అసభ్యకర కామెంట్లు చేసిన వారిని వదలం

సోష‌‌‌‌‌‌‌‌ల్ మీడియాలో ఓ చిన్నారిపై కొంద‌‌‌‌‌‌‌‌రు యువకులు అసభ్యకర కామెంట్లు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రజాభవన్​లో మంత్రి సీతక్క నివాళులర్పించారు. అదేవిధంగా, ప్రజా భవన్​లోని తన క్యాంప్ ఆఫీస్​లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 13,600 చదరపు అడుగుల పైకప్పు విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణంలో ఏడాదికి సుమారు 1.15 మిలియన్ లీటర్ల వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చని తెలిపారు.