తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షమమే సర్కారు ధ్యేయం : మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షమమే సర్కారు ధ్యేయం : మంత్రి సీతక్క
  • రాష్ట్ర పంచాయతీ రాజ్​శాఖ  మంత్రి సీతక్క

వేములవాడరూరల్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ వద్ద రూ.కోటితో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన  చేశారు. 

నాంపల్లి గుట్ట–సంకేపల్లి రోడ్డును అభివృద్ధి చేయాలని, కోనాయపల్లి–కాషాయపల్లి మధ్య రోడ్డు నిర్మించాలని, బాలానగర్–శాత్రాజు పల్లి మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, రుద్రంగి, భీమారం మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలకు భవనాలు నిర్మించాలని విప్ శ్రీనివాస్​ మంత్రిని కోరారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్​నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులున్నారు. 

రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ

రాజన్న సిరిసిల్ల : రూ.150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వేములవాడలోని భీమేశ్వరాలయంలో మంత్రి సీతక్కతో కలిసి పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మేడారంలో కూడా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.  

రుద్రంగిని మోడల్ విలేజ్​గా తీర్చిదిద్దుతా

చందుర్తి : రుద్రంగిని మోడల్ విలేజ్​గా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రుద్రంగిలో నిర్మించిన ఎంఆర్సీ భవనాన్ని ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రుద్రంగిలో పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. 

అడ్వాన్స్ డ్​ టెక్నాలజీ సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వం రూ.42 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇందిరా చౌక్–కుక్కుల గండి బీటీ రోడ్డు, రుద్రంగి–దసరా నాయక్ తండా అప్రోచ్ సీసీ రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. సర్పంచ్ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

వేములవాడరూరల్: వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మండలోజు సందీప్ తల్లి భూలక్ష్మి శుక్రవారం మృతిచెందారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.