- మహిళా సాధికారతే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్: మంత్రి సీతక్క
- 95 % మంది మహిళలకు ఉపాధి కల్పనే టార్గెట్ అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇకపై ప్రైవేట్ స్కూళ్ల యూనిఫాంల కుట్టు పనులు కూడా డ్వాక్రా సంఘాలకే అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలోని 95 శాతం మంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ప్రజాభవన్‌లో అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52.7 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తిని 2047 నాటికి 95 శాతానికి పెంచేలా బ్లూప్రింట్ రెడీ చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ స్కూళ్ల యూనిఫాంల తయారీ కూడా..
సర్కారు బడుల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం వారికి సమకూరుతున్నదని మంత్రి సీతక్క తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రైవేట్ రంగంలోనూ మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లలో యూనిఫాంల తయారీ కాంట్రాక్టులను కూడా మహిళా సంఘాలకే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు యూనివర్సల్ చైల్డ్ కేర్, యూనివర్సల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందేలా పక్కా ప్లాన్ రూపొందించాలని సూచించారు.
గ్లోబల్ మార్కెట్ టార్గెట్...
మహిళలు కేవలం కుట్టు మిషన్లకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు టీ-హబ్, వీ-హబ్ సహకారంతో మహిళా స్టార్టప్ లను విదేశీ మార్కెట్‌లకు అనుసంధానం చేసేలా విజన్ డాక్యుమెంట్‌లో చోటు కల్పించనున్నారు.
టెక్స్‌టైల్, టూరిజం, సోలార్, ఆగ్రో-ఫుడ్ రంగాల్లో మహిళలకు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగుల కోసం చర్యలు చేపట్టనున్నారు. ఉద్యోగాలకు వెళ్లే మహిళల పిల్లల కోసం నాణ్యమైన క్రెచ్‌లు, సురక్షితమైన రవాణా, పని ప్రదేశాల్లో సేఫ్టీ గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడంలో మహిళలదే కీ రోల్ అని సీతక్క పేర్కొన్నారు.
