- సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఐఎంఎంటీతో సింగరేణి ఒప్పందం
- ఖనిజ స్వయంసమృద్ధిలో ఇది గొప్ప ముందడుగు: సీఎండీ ఎన్ బలరామ్
హైదరాబాద్, వెలుగు: బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాల వెలికితీతకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
మంగళవారం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సమక్షంలో ఐఎంఎంటీ చీఫ్ సైంటిస్ట్, హైడ్రో, ఎలక్ట్రో మెటలర్జీ విభాగం అధిపతి డాక్టర్ కాళీ సంజయ్, సింగరేణి సంస్థ డైరెక్టర్(పీ అండ్ పీ) కె.వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి షేల్, మట్టి, సాండ్ స్టోన్, గ్రానైట్ రాళ్లు, బొగ్గు ఫ్లై యాష్, బాటమ్ యాష్ లలో నిక్షిప్తమై ఉన్న కీలక ఖనిజాలను వెలికితీయనున్నారు.
ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. ఖనిజ రంగంలో పరస్పర సహకారం కోసం ఈ ఏడాది జూన్ లో తొలుత ఒక అవగాహన కుదుర్చుకున్నామని, తాజా ఒప్పందంతో ఈ ప్రాజెక్టు ప్రారంభానికి బలమైన ముందడుగు పడిందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్టు గనుల్లో, ఎస్టీపీపీ నుంచి వెలువడుతున్న ఫ్లైయాష్, బాటమ్ యాష్ లో, ఇక్కడి గుట్టల్లో కీలక ఖనిజాల ఉనికిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో కొన్నింటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి సందర్భంగా విడుదలయ్యే ఫ్లైయాష్ లో కూడా విలువైన ఖనిజాలను గుర్తించామన్నారు. మణుగూరుకు సమీపంలోని దుర్గం గుట్ట బ్లాకులో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాంపిల్స్ ద్వారా నిర్ధారణ అయిందని తెలిపారు.
14 రకాల ఖనిజాల గుర్తింపు
సింగరేణి ప్రాంతంలో మొత్తం14 రకాల ఖనిజాల ఉనికిని గుర్తించామని సీఎండీ బలరామ్ తెలిపారు. వీటిలో లాంథనం, సీరియమ్, ప్రసియోడీమియం వంటి 6 రకాల లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. అలాగే ఇట్రియం, స్కాండియం, డిస్ఫ్రోజియం వంటి 8 రకాల హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని కనుగొన్నామని చెప్పారు.
