
బషీర్ బాగ్, వెలుగు : తల్లిదండ్రులు ఆడ, మగ అనే తేడా లేకుండా పిల్లలను పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని మంత్రి సీతక్క చెప్పారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖల ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి సీతక్క, మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పలువురు మహిళా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల్లో నర్సరీ క్లాసులు ప్రారంభిస్తామన్నారు. సిటీలోని స్లమ్ ఏరియాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి, అక్కడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.
ఆదివాసీ బిడ్డగా ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని.. తర్వాత ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. లక్ష్యంతో ముందుకు వెళ్తే అనుకున్న స్థానాలకు వెళ్లొచ్చు అనే దానికి తన జీవితమే నిదర్శనమని సీతక్క చెప్పారు. ఏ కోర్టులో అయితే నక్సలైట్ గా నిలబడ్డానో.. ఐదేళ్ల తరువాత అదే కోర్టులో ఎల్ఎల్బీ పూర్తిచేసి నల్లకోటు ధరించి కేసులు వాదించానని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను మంత్రి ఘనంగా సన్మానించారు. రూ.లక్షల నగదు ప్రోత్సాహం అందజేశారు.