
- స్వచ్ఛ భారత్, ఉపాధి స్కీమ్ కింద టాయిలెట్ల నిర్మాణం
- అంగన్వాడీలకూ ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మంత్రి సీతక్క ప్రతిపాదన
- చాలా కేంద్రాల్లో తాగునీరు, కరెంటు, టాయిలెట్ సౌకర్యాలు కరువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో కరెంట్, తాగునీటి వసతి, టాయిలెట్స్ లాంటి కనీస సౌక ర్యాలు లేవని జిల్లాల వారీగా ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. రాష్ట్రంలో సున్నా నుంచి 3 ఏండ్లు, 3 నుంచి 7 ఏండ్ల వరకు మొత్తం పిల్లలు సుమారు 18.84 లక్షల మంది ఉండగా, గర్భిణులు, బాలింతలు కలిపి సుమారు 3 లక్షల మంది ఉన్నారు.
మొత్తం 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 14,866 (41.6 శాతం) కేంద్రాలకు మాత్రమే కరెంట్ సౌకర్యం ఉంది. 5,981 (16.8 శాతం) కేంద్రాలకు మాత్రమే తాగునీటి సౌకర్యం, 11,595 (32.5 శాతం) కేంద్రాలకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంది. జిల్లా లవారీగా వివరాలను పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లాలో ఒక్క అంగన్వాడీ కేంద్రానికి కూడా కరెంట్ కనెక్షన్ లేదని వెల్లడైంది. ఇక డ్రింకింగ్ వాటర్‌ను పరిశీలిస్తే సిరిసిల్ల జిల్లాలో 2.4 శాతం కేంద్రాలకే తాగునీటి వసతి ఉండగా 15 జిల్లాల్లో 20 శాతం లోపే వాటర్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఉచిత కరెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో అంగన్వాడీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని మహిళాస్ర్తీ, శిశు సంక్షేమ అధికారులు ప్రతిపాదించగా ఈ అంశాన్ని సీఎం, సీఎస్ దృష్టికి మంత్రి సీతక్క తీసుకెళ్లారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రాష్ర్టంలో ఉన్న 35 వేల అంగన్వాడీలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలు ఉంటారని , వీరితో పాటు బాలింతలు, గర్భిణులు కేంద్రాలకు వచ్చినా కొద్దిసేపు ఉంటారని, ఈ నేపథ్యంలో చాలా తక్కువ కరెంట్ వినియోగం అవుతుందని మంత్రి వివరించారు. చాలా స్కూళ్లకు కరెంట్ వసతి లేదని, ఉన్న చోట్ల కరెంట్ బిల్లు గ్రామ పంచాయతీలకు అదనపు భారంగా మారుతున్నదని ఆమె పేర్కొన్నారు.
దశల వారీగా సౌకర్యాల కల్పన
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో తాగునీరు, కరెంటు, టాయిలెట్ల వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ అంగన్వాడీ పేరుతో వసతుల కల్పనకు నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్
ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండగా.. తాగునీరు సరఫరాను మిషన్ భగీరథ ద్వారా, టాయిలెట్ల నిర్మాణం స్వచ్ఛ భారత్, ఉపాధి హామీ ఫండ్స్ తో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
12 వేల అంగన్ వాడీలకు సొంత బిల్డింగులు లేవు
రాష్ర్టంలో 12,276 అంగన్వాడీ కేంద్రాలకు సొంత బిల్డింగ్లు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 886 భవనాలు మంజూరు కాగా, 220 కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది 1,174 కేంద్రాలకు సొంత బిల్డింగులు మంజూరయ్యాయి. వీటిలో ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ట్రైబల్ ఏరియాల్లో ఆ శాఖ బడ్జెట్ ద్వారా నిర్మిస్తుండగా ఒక్కో నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
సిద్దిపేట, సిరిసిల్లలో సౌకర్యాలు నిల్
రాష్ట్ర అవిర్భావం తరువాత పదేండ్ల పాటు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. ఏ స్కీమ్ లో అయినా ఎక్కువ
అభివృద్ధి ఈ మూడు చోట్లే జరిగిందనేది వాస్తవం. అయితే, అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనలో ఈ మూడు నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో వసతులు దారుణంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు ఉన్న దగ్గర మొత్తం 1,150 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 819 కేంద్రాలకు (71.2 శాతం) కరెంట్ వసతి లేదు. పది శాతం కేంద్రాలకు తాగునీరు, టాయిలెట్లు లేవు. ఇక సిరిసిల్ల జిల్లాలో 587 కేంద్రాలు ఉండగా 12.4 శాతం కరెంట్ సౌకర్యం , 2.4 శాతం తాగు నీటి సౌకర్యం,5.1 శాతం టాయిలెట్స్ లేవని నివేదికలో అధికారులు స్పష్టం చేశారు.