పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటం : మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటం : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సెగ్మెంట్​లోని ఎమ్మెల్యేల ప్రకటన
  • పెద్దపల్లి.. కాంగ్రెస్​కు అడ్డా  
  • సర్వే ఆధారంగానే వంశీకి టికెట్
  • కాకా సేవలను కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సెగ్మెంట్ లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి సేవలను కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ బేగంపేట్ లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో పెద్దపల్లి సెగ్మెంట్ లోని ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థి వంశీతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లి కాంగ్రెస్ కు అడ్డా అని, ఇక్కడ భారీ మెజార్టీతో వంశీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  

‘‘యువకుడు, విద్యావంతుడు, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ పారిశ్రామికవేత్త అయిన వంశీ.. తన తాత  కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు. అలాంటి సేవాభావం ఉన్న యువ నేతను ఆదరించి ఆశీర్వదించాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి సెగ్మెంట్ లో ఎంతో కాలంగా విశాక ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న వంశీ, అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందారని అన్నారు. పార్టీ​హైకమాండ్ సర్వే చేసిన తర్వాతే ప్రజల మద్దతు ఉన్న వంశీని అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిపారు.

యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే కలిసి వంశీకి టికెట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు తనతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకి హైకమాండ్ తో పాటు పీసీసీ పూర్తి మద్దతు ఉందన్నారు. ‘‘వంశీకి ఉన్న ఉత్సాహం, చదువు, చేస్తున్న బిజినెస్ ను బట్టి ఆయన ఎంపీగా గెలిస్తే పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతారనే నమ్మకం ఉంది. సర్వే ఆధారంగానే పెద్దపల్లి అభ్యర్థి ఎంపిక జరిగింది.

ఇక్కడి నుంచి టికెట్ ఆశించి రానివాళ్లకు పార్టీ కచ్చితంగా న్యాయం చేస్తుంది. పార్టీ తరఫున మేం అండగా ఉంటాం. పెద్దపల్లి నియోజకవర్గానికి కాకా వెంకటస్వామి దశాబ్దాల పాటు సేవ చేశారు. ఇప్పటికీ జనం కాకా సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుమారులు వివేక్, వినోద్​ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు కాకా మనుమడు వంశీని కూడా అలాగే ఆదరించాలి” అని కోరారు. 

శ్రీధర్ బాబు నాకు రోల్ మోడల్ : వంశీ 

మంత్రి శ్రీధర్ బాబు తనకు రాజకీయాల్లో రోల్ మోడల్ అని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘2004 లో మొదటిసారి శ్రీధర్ బాబును కలిశాను. మీరు నాకు రోల్ మోడల్’ అని అప్పుడే ఆయనతో చెప్పాను. ఆయన ఆశీర్వాదం వల్లే నాకు పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చింది. 20 ఏండ్ల తర్వాత శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజా సేవలో పనిచేసే అవకాశం దక్కినందుకు  గర్వంగా ఫీలవుతున్నాను’’ అని చెప్పారు.

కాకా చేసిన సేవలను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచాక నియోజవకర్గ అభివృద్ధి కోసం  కష్టపడి పని చేస్తానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ‘‘నాకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నేతలు సోని యా, రాహుల్,  ప్రియాంక, ఖర్గే, రేవంత్ , శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు. శ్రీధర్ బాబు ఆదేశం మేరకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు” అని తెలిపారు.

మా కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంది

పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​లోని ఎమ్మెల్యేలంతా వారికి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో వంశీని గెలిపిస్తామని చెప్పడం సంతోషకరం. వాళ్లందరికీ ధన్యవాదాలు.  మా కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంది. అప్పట్లో సింగరేణి ఉద్యోగులను మా నాన్న కాకా వెంకటస్వామి ఆదుకున్నారు. లక్ష మంది ఉద్యోగాలు పోకుండా కాపాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెనింగ్​లోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీ చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగానే వంశీకి హైకమాండ్​టికెట్​ కేటాయించింది. 

వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత మాది

తెలంగాణ ఏర్పాటులో కాకా వెంకటస్వామి కుటుంబం కీలకంగా వ్యవహరించింది. కాకా మనుమడు వంశీ రాజకీయాల్లోకి రావడం సంతోషకరం. వంశీని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది. ప్రతి ఓటరును కలిసి వంశీని గెలిపించుకుంటం. సింగరేణి కార్మికులకు కాకా ఎంతో సేవ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం రీఓపెనింగ్​ విషయంలో కాకా ఫ్యామిలీ కృషి చేసింది.

అడ్లూరి లక్ష్మణ్, ధర్మపురి ఎమ్మెల్యే 

గెలుపును ఆపలేరు

పెద్దపల్లిలో వందకు వంద శాతం వంశీనే గెలవబోతున్నారు. ఇన్నేండ్లు అధికారంలో ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయని అసమర్థ నేత కొప్పుల ఈశ్వర్. బీఆర్ఎస్​, బీజేపీ  ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్​గెలుపును ఆపలేరు. రాహుల్​గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతులపై కేసీఆర్​వి మొసలి కన్నీళ్లు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు పొలాల వెంట తిరుగుతున్నారు.

విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే 

వంశీని గెలిపిద్దాం

మా తమ్ముడి కుమారుడు వంశీ బేటాను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఫ్యామిలీతో మా నాన్నకు మంచి సంబంధాలు ఉన్నాయి. మా నాన్న చేసిన సేవలకు గుర్తింపుగా మా కుటుంబానికి మంచి అవకాశాలు ఇస్తున్నందుకు హైకమాండ్​కు ధన్యవాదాలు. వంశీ బేటాకు టికెట్​ ఇచ్చినందుకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు. 

గడ్డం వినోద్​, బెల్లంపల్లి ఎమ్మెల్యే  

శ్రీధర్ బాబు నాయకత్వంలో ముందుకు..

రాష్ట్రంలో పెద్ద పార్లమెంట్​నియోజకవర్గాల్లో పెద్దపల్లి ఒకటి. ఇక్కడి నుంచి వంశీని బరిలోకి దింపాలని ఏఐసీసీ నిర్ణయించింది. పెద్దపల్లి ఇన్​చార్జిగా ఉన్న శ్రీధర్​ బాబు నాయకత్వంలో ముందుకువెళ్తాం. 

ప్రేమ్​సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే

బంపర్​మెజారిటీ పక్కా

శ్రీధర్​బాబు నాయకత్వంలో పెద్దపల్లి పరిధిలోని ఎమ్మెల్యేలందరం కలిసి కష్టపడి వంశీని గెలిపిస్తాం. బంపర్​మెజారిటీ తీసుకొస్తం. కాకా వారసత్వాన్ని వంశీ ముందుకు తీసుకెళ్తారు. మా ప్రభుత్వ వంద రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం. దేశంలో జరుగుతున్న అరాచక పాలనను తరిమికొట్టి కాంగ్రెస్​ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.   

రాజ్ ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే