మంచిర్యాల: సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలిస్తాం..22A జీవో సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు 

మంచిర్యాల: సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలిస్తాం..22A జీవో సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు 

మంచిర్యాల, వెలుగు: సింగరేణి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకొని నివాసముంటున్న వారికి త్వరలోనే పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాలలో 22ఏ జీవో సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు బర్త్ డే వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి శ్రీధర్​బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ నుంచి మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన వేడుకల్లో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచాడని ప్రశంసించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరం కలిసి కాంగ్రెస్ ఎంపీని గెలిపించామని, కలిసి మెలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. పార్టీలో సీనియర్లకు, అసలైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోబోని అన్నారు.