ఇదేం వాకౌట్?... ఇలా బయటకెళ్లి మళ్లీ అలా రావడం ఏంటి? : మంత్రి శ్రీధర్ బాబు

ఇదేం వాకౌట్?... ఇలా బయటకెళ్లి మళ్లీ అలా రావడం ఏంటి? : మంత్రి శ్రీధర్ బాబు
  •     బీఆర్ఎస్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ 
  •     ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే వాకౌట్‌ చేస్తున్నరని ఆగ్రహం

 హైదరాబాద్, వెలుగు: వాకౌట్ పేరుతో తరచూ అసెంబ్లీలోంచి బయటకెళ్లి, తిరిగి వచ్చి కూర్చుకుంటున్న బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. శనివారం సభలో బీసీ, రవాణా, హోం శాఖల బడ్జెట్ పద్దుపై మంత్రులు రిప్లై ఇచ్చారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ బీఆర్‌‌ఎస్ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం తీరుపై మంత్రి మండిపడ్డారు. 

‘బీఆర్ఎస్ సభ్యులకు చిత్తశుద్ధి లేదు. ముఖ్యమైన అంశాలపై హౌస్‌లో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేస్తున్నారు. వాకౌట్ చేస్తే రోజంతా చేయాలి.. కానీ ఇలా బయటకెళ్లి, మళ్లీ అలా హౌస్‌లోకి వస్తున్నారు.. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.. అది మర్చిపోవొద్దు..’అంటూ చురకలంటించారు. 

బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు తాము బీసీ రిజర్వేషన్లపై ఓ అడుగు ముందుకేస్తే.. వాళ్లేమో అక్కసుతో పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నం.. 

ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమమా.. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. ఏం చేయడం లేదంటూ విమర్శించడం ఎంత వరకు సమంజసం అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రవాణా శాఖలో పారదర్శకతకు పెద్ద పీట వేసేలా పౌరులకు మరింత వేగవంతమైన సేవలు అందేలా టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడేమో మేమేం చేయడం లేదంటూ మమ్మల్ని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు.. వాళ్లతో మాట్లాడేందుకు ఒక్కరంటే ఒక్కరూ వెళ్లలేదని, అలాంటి మీరా ఇప్పుడు మాట్లాడేదని నిలదీశారు. 

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించింది తమ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇంకా తమకు మూడేండ్ల సమయం ఉందని, ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనన్నారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.