ఎన్నికల కోసం కేసీఆర్​ మొసలి కన్నీరు : శ్రీధర్​బాబు

ఎన్నికల కోసం కేసీఆర్​ మొసలి కన్నీరు : శ్రీధర్​బాబు
  • రైతుల ప్రస్తుత సమస్యలకు ఆయనే కారణం

పెద్దపల్లి, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేసీఆరే కారణమని, అలాంటి వ్యక్తే ఇప్పుడు లోక్​సభ ఎన్నికల కోసం రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. ‘‘నిరుడు ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు.. దీంతో రిజర్వాయర్లు నిండలేదు.. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్​ సర్కారే.

మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ల హయాంలోనే.. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ల హయాంలోనే. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలే అయింది.. అప్పటికే వర్షాకాలం అయిపోయింది. కానీ, కాంగ్రెస్​ప్రభుత్వమే కరువుకు కారణమని కేసీఆర్​ చెప్పడం విడ్డూరం’’ అని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడారు.

పంటల పరిశీలన పేరుతో కాలువలు లేని దగ్గర, బోర్ల మీద ఆధారపడి పంటలు పండించే దగ్గర కేసీఆర్​ పర్యటించి, రాష్ట్రమంతా పంటలు ఎండినట్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. తమ ప్రభుత్వం సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని ఆయన వెల్లడించారు. 

పదేండ్లలో పరిహారం ఎందుకియ్యలే

బీఆర్​ఎస్​ పదేండ్ల  పాలనలో ఏనాడూ రైతులను పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, ఇలాంటి సమయాల్లో రైతులను ఆదుకునే ప్రణాళికలు ఏమీ రూపొందించలేదని మండిపడ్డారు. లక్ష రూపాయల రుణ మాఫీని సగం మంది రైతులకు కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ అమలుచేయలేదని అన్నారు.

కాళేశ్వరం రీడిజైనింగ్​సరికాదని కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచీ చెప్తున్నా అప్పటి బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోలేదు. కాళేశ్వరం పేరుతో  రైతుల భూములు, ఇండ్లు తీసుకున్నారు తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా రైతులకు చుక్క నీరు కూడా రాలేదు” అని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలోని  పాలకుర్తి లిఫ్ట్​ను పూర్తి చేస్తామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిచేశాకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. డీ 83, 86 కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు.

బీఆర్​ఎస్ నుంచి టికెట్​ పొందినవాళ్లు గత పాలనలో సాగిన ఫోన్​ ట్యాపింగ్​, లిక్కర్​ స్కామ్​ గురించి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, టికెట్​వద్దనుకొని కాంగ్రెస్​లో చేరుతున్నారని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ఫోన్​ ట్యాపింగ్​లో నిందితులుగా ఉన్నవాళ్లు దోషులుగా తేలితే కఠిన శిక్షలుంటాయని చెప్పారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్​ మక్కాన్​ సింగ్​, నాయకులు గోపగాని సారయ్య, మస్రత్​, ప్రకాశరావు, అన్నయ్యగౌడ్​ తదితరులు పాల్గొన్నారు. 

నిరుడు ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు.. దీంతో రిజర్వాయర్లు నిండలేదు.. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్​ సర్కారే. మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ల హయాంలోనే.. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ల హయాంలోనే. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలే అయింది. అలాంటిది కరువుకు కాంగ్రెస్​ ప్రభుత్వమే కారణమని కేసీఆర్​ చెప్పడం విడ్డూరం.  ‑ మంత్రి శ్రీధర్​బాబు