పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం: శ్రీధర్ బాబు

పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం:  శ్రీధర్ బాబు

యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గడ్డం వంశీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు మంత్రి  శ్రీధర్ బాబు. పెద్దపల్లి లోక్ సభ ఇన్ ఛార్జ్ గా ఉన్న శ్రీధర్ బాబు.. ఇవాళ గడ్డం వంశీకి మద్దతుగా.. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ , మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్  సాగర్  రావులతో ప్రెస్ మీట్ నిర్వహించారు.

 ఈ సందర్బంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. వంశీకృష్ణకు ఏఐసీసీ పూర్తి సపోర్ట్ ఉందన్నారు.  కాకా వెంకటస్వామి మనవడిగా గడ్డం వంశీకి గుర్తింపు ఉందని.. తన ట్రస్ట్ ద్వారా వంశీ అనేక  సేవా కార్యక్రమాలుచేస్తున్నారని చెప్పారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు.  వంశీకృష్ణను గెలిపించడానికి తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు.   వంశీకృష్ణను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.   

పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అడ్డా అని రామగుండం ఎమ్మెల్యే  రాజ్ ఠాకూర్  అన్నారు. దేశంలో దుర్మార్గపు పాలన అంతం కోసం కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పారు. 

వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ .  మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో  వంశీకృష్ణకు భారీ మెజారిటీ తీసుకొస్తామని చెప్పారు. అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు  శ్రీధర్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు వినోద్, తమ కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటామని చెప్పారు.

ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన వంశీ..ప్రజా సేవ చేసి  కాకా పేరును నిలబెడుతానని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు.