
- అడ్వాన్స్ డ్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తెస్తున్నామని వెల్లడి
- జర్మన్ కంపెనీ ఫ్రాన్హోపర్ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను నంబర్ వన్ గా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమన్నారు. వ్యవసాయంలో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) లాంటి టెక్నాలజీని రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు అనుసంధానం చేసే అంశంపై మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు.
రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి ఈ రంగం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు చేయూతను అందిస్తోందని తెలిపారు. మరోవైపు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కు రాష్ట్రం గ్లోబల్ హబ్ గా మారిందన్నారు. ఇలాంటి తరుణంలో డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించామని వెల్లడించారు.
‘‘పెట్టుబడి వ్యయం, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక సెన్సర్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చు. దీంతో రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతాయి.
పర్యావరణానికీ మేలు జరుగుతుంది” అని మంత్రి పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో రెండేళ్లుగా వేములవాడకు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిలరేటింగ్ క్లైమేట్- రెసిలియెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చొరవ తీసుకోవాలని సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు.