నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను రీఓపెన్​ చేస్తాం

నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను రీఓపెన్​ చేస్తాం
  • కేంద్రం చెరుకు టన్నుకు రూ.45 వేలు చెల్లించాలె: మంత్రి శ్రీధర్​బాబు

నిజామాబాద్/బోధన్, వెలుగు: నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను రీఓపెన్ ​చేయిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంచిగా నడుస్తున్న ఫ్యాక్టరీలను బీఆర్ఎస్ ​ప్రభుత్వం క్లోజ్​చేసిందని మండిపడ్డారు. వాటంన్నిటినీ రీఓపెన్​చేస్తామని, కార్మికులు, రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి స్థానికంగా పర్యటిస్తున్నామని చెప్పారు. శనివారం నిజామాబాద్​జిల్లా బోధన్​లోని శక్కర్​నగర్ ఫ్యాక్టరీని ఆయన కమిటీ సభ్యులతో కలిసి విజిట్​చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగును ఎంకరేజ్​చేయడానికి సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం నుంచి ఇచ్చేలా కమిటీ తరఫున నివేదిస్తామని చెప్పారు.

కార్మికుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. ఫ్యాక్టరీ గేట్లు ఓపెన్​చేశాక ఇక ఎప్పటికీ మూతబడవన్నారు. అగ్రికల్చర్, పారిశ్రామిక నిపుణులతో చర్చిస్తున్నామని, మిల్లు నడిపిన ప్రైవేట్ మేనేజ్​మెంట్​బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లపై పూర్తి స్టడీ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం టన్ను చక్కెర రేటును రూ.33 వేల నుంచి రూ.45 వేలకు పెంచాలని డిమాండ్​చేశారు. ఇందుకు ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈనెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ. 500కు వంట గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్​అమలు చేయబోతున్నామన్నారు. ఔటర్​ రింగ్​ రోడ్​ తరహాలో జిల్లాలు, ముఖ్య పట్టణాలను లింక్​ చేస్తూ రీజనల్​ రింగ్​ రోడ్​ నిర్మించే ఆలోచన చేస్తున్నామని, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు పది రోజుల్లో కొత్త పాలసీ తేనున్నామని వెల్లడించారు.

సబ్​కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, భూపతిరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్​సెక్రెటరీ జయేశ్​రంజన్​, నిజాం షుగర్స్​ఎండీ డాక్టర్​ మక్సూద్, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. లేఆఫ్​ కాలానికి సంబంధించిన జీతభత్యాలపై న్యాయం చేయాలని కార్మిక నేతలు మంత్రిని కోరారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, మందర్నా రవి, అజయ్​వడియార్, ఉపేందర్​ మంత్రితో మాట్లాడారు.