ఈ గవర్నెన్స్, హెల్త్ కార్డుల డిజిటలైజేషన్లో సహకరించండి

ఈ గవర్నెన్స్, హెల్త్ కార్డుల  డిజిటలైజేషన్లో సహకరించండి
  • ఎస్టోనియా రాయబారిని కోరిన మంత్రి శ్రీధర్ బాబు
  • టెక్స్​టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తైవాన్ ప్రతినిధులకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఈ గవర్నెన్స్, హెల్త్ కార్డుల డిజిటలైజేషన్​లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్టోనియా సహకారం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం ఎస్టోనియా రాయబారి మ్యారియో లూప్ నేతృత్వంలోని ప్రతినిధులు, తైవాన్ టెక్స్ టైల్ ఫెడరేషన్(టీటీఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధులు విడివిడిగా మంత్రి శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్​లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్టోనియా సాంకేతిక సహకారం అందించాలని కోరారు.

వాణిజ్యం, ఏఐ టెక్నాలజీలో కూడా కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్​లో తమ దేశ పర్యటనకు రావాలని ఎస్టోనియా రాయబారి కోరగా.. శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఈ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తామన్నారు.

రైజింగ్ తెలంగాణలో భాగమవండి

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ– తైవాన్ మాన్యుఫాక్చరింగ్ జోన్’, ప్రత్యేక టైక్స్ టైల్ క్లస్టర్ లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్వల్ప కాలంలోనే టెక్స్ టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దీటుగా ఎదిగిందని తెలిపారు. 

దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్(కేఎంటీపీ) గేమ్ చేంజర్ గా మారిందని చెప్పారు. కేఎంటీపీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.