బీజేపీ, బీఆర్ఎస్ ​చెట్టాపట్టాల్

బీజేపీ, బీఆర్ఎస్ ​చెట్టాపట్టాల్
  • ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నయ్: మంత్రి శ్రీధర్​బాబు 
  •     ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ మోసం చేసింది
  •     సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తున్నది  
  •     పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలని పిలుపు 
  •     బెల్లంపల్లిలో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్

బెల్లంపల్లి, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ ​చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని.. కాంగ్రెస్​ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలోని ఓ ఫంక్షన్​హాల్​లో పెద్దపల్లి పార్లమెంట్​నియోజకవర్గ కాంగ్రెస్​కార్యకర్తల మీటింగ్​జరిగింది. ఇందులో బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్​వెంకటస్వామి, మక్కాన్​సింగ్​రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ఆరెపల్లి మోహన్, ఐఎన్​టీయూసీ సెక్రటరీ జనరల్​జనక్​ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. ‘‘రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. అయినా బీజేపీ, బీఆర్ఎస్​పార్టీలు కాంగ్రెస్​ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి’’ అని మండిపడ్డారు. ‘‘బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ కేవలం 6 లక్షల ఉద్యోగాలే ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ఎల్ఐసీ, సింగరేణి సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నది” అని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్​ఏనాడూ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన పార్టీకి ఓటేద్దామా? తెలంగాణను దోచుకుని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే పార్టీలకు ఓటేద్దామా?’ అనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. 

వంశీని గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు

 పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ‘‘కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించేందుకు వంశీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి. పార్లమెంట్​లో రైతుల సమస్యలు వినిపించేందుకు వంశీని గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు. ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే ఆ గ్రామాల్లో, మండలాల్లో సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వివేక్, వంశీకృష్ణ తీసుకుంటారని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నీటిని బెల్లంపల్లికి అందించి మంచినీటి సమస్య తీర్చాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరినట్టు చెప్పారు. 

వంశీని గెలిపిస్తే ప్రజల గొంతుక అయితడు: రాజ్ ఠాకూర్ 

పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే, ప్రజల గొంతుకగా పార్లమెంట్​లో పులిలా గర్జిస్తాడని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​రాజ్​ఠాకూర్ అన్నారు. ‘‘సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీలుగా మారుతున్నారు. కార్మికులకు అండగా ఉండేది కాంగ్రెస్​ ప్రభుత్వమే” అని అన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్​జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

సింగరేణి స్థలాల్లో ఉన్నోళ్లకు పట్టాలిస్తం: గడ్డం వినోద్ 

బెల్లంపల్లిలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ ఎంపీ ఎన్నికల తర్వాత ఇండ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. కాకా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ తీసుకొస్తే.. అందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి లోకల్​బాడీ ఎలక్షన్లలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నన్ను గెలిపిస్తే యూత్​కు జాబ్స్: గడ్డం వంశీకృష్ణ 

పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్​లో ప్రజల సమస్యలపై గళం వినిపిస్తానని, ఈ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘కాకా వెంకటస్వామి నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారు. సింగరేణి సంస్థ అప్పుల్లో ఉన్నప్పుడు రూ.450 కోట్ల లోన్​ఇప్పించి లక్ష ఉద్యోగాలను కాపాడారు’’ అని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్​లో కోల్డ్​ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయిస్తానన్నారు. పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్​కాలేజీగా అప్​గ్రేడ్​ చేసేందుకు, బెల్లంపల్లి రైల్వే స్టేషన్​లో సూపర్​ఫాస్ట్​ రైళ్ల హాల్టింగ్​కు కృషి చేస్తానని చెప్పారు.  

నేతకాని కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తాం: వివేక్​ వెంకటస్వామి 

గత ప్రభుత్వం నేతకాని కులస్తులను పట్టించుకోలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతకాని కార్పొరేషన్​ను ఏర్పాటు చేసి, ఆ కులస్తుల గౌరవాన్ని కాపాడుతుందని హామీ ఇచ్చారు. ‘‘కాకా వెంకటస్వామిని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఆదరించారు. జైపూర్​పవర్​ప్లాంట్​ఏర్పాటుకు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెనింగ్​కు కాకా కృషి చేశారు. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి” అని కోరారు. బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో కేసీఆర్, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులే బాగుపడ్డారని విమర్శించారు. అహంకారి, నియంత కేసీఆర్​కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.