కేసీఆర్ గట్టిగానే ఉన్నారు.. ఆందోళన అవసరం లేదు

కేసీఆర్ గట్టిగానే ఉన్నారు.. ఆందోళన అవసరం లేదు

హైదరాబాద్:తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడటం తప్ప కాంగ్రెస్ ,బీజేపీ లకు ఏం చేతకాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విప‌క్షాల‌పై మండిప‌డ్డారు. ఆ పార్టీల నేత‌ల‌ తీరు చూస్తుంటే తెలంగాణ పై విషాన్నిచిమ్మడమే వారి పని అయినట్టు గా ఉందని, సొంత గడ్డకు ద్రోహం చేయడమే వారి విధానమ‌ని విమ‌ర్శించారు. బుధ‌వారం టీఆర్ఎస్ ఎల్‌పీ ఆఫీస్ లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ… ”పాత సచివాలయం బాగా పాడుబడ్డది. అయినా అందులోనే సంసారం చేయాలా? సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టే. హైకోర్టు తీర్పు కోసం ఏడాది ఓపిక పట్టాం. సచివాలయ నిర్మాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా మతి లేని మాటలు ఎందుకు? పాత సచివాలయం దేనికీ పనికి రాదు. అగ్ని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యులు?” అని ప్రశ్నించారు.

”తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా నేతల్లా మాట్లాడుతారా? అందరి నిజస్వరూపాలు సెక్షన్ 8 పై వారి మాటల ద్వారా బయటపడ్డాయి. ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం. తెలంగాణ అస్తిత్వంపై రాజీ పాడేది లేదు. మన తెలంగాణపై ఇతరుల పెత్తనం సహించేది లేదు. బానిస తెలంగాణను అనుమతించకే అప్పుడే స్వరాష్ట్రం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు ప్రాణాలకు తెగించి అయినా పరాయి మనస్తత్వ బానిస నేతలపై పోరాడతాం” అని మంత్రి స్పష్టం చేశారు.

”ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడ లేదు. ఆయన నైజం సెక్షన్ 8 పై మాట్లాడటంతో బయట పడింది. కాంగ్రెస్ ,బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలను కోల్పోయింది. సచివాలయ నిర్మాణం తో ప్రజా ధనం వృధా కాదు. ఉమ్మడి ఏపీ లో ప్రభుత్వ భూములను అప్పనంగా దోచి పెట్టిన వారికి ప్రజాధనం గురించి మాట్లాడే హక్కు లేదు” అని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్షాలు చేసే కామెంట్‌ల‌పై మండిప‌డుతూ…స‌స‌ సీఎం కెసిఆర్ తెలంగాణ గడ్డ మీద నుంచే పాలిస్తున్నారు.. ఆయ‌న వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా? ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడుంటే ఏమిటీ? ఏ పథకమైనా ఆగిందా?ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆగిందా? కెసిఆర్ గట్టిగానే ఉన్నారు. ఆయనది బలమైన గుండె కాయ. సీఎం ఎంత గట్టి గా ఉన్నారో మాకు తెలుసు. ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని మంత్రి వెల్లడించారు.