చావడానికైనా చంపడానికైనా సిద్ధం: శ్రీనివాస్ గౌడ్

చావడానికైనా చంపడానికైనా సిద్ధం: శ్రీనివాస్ గౌడ్

చావడానికైనా చంపడానికైనా సిద్ధమని.. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో రాకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఈడిగ ఆంజ‌నేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఏపీలో చదువు రాని వారిని కూడా హెల్త్ మినిస్టర్లను చేశారని..కేసీఆర్  అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులిస్తున్నారని చెప్పారు. అందరికీ పదవులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో క్రీడా పాలసీని  తీసుకొస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సకలజనుల సంపద పెరిగింది: ఆంజనేయ గౌడ్ 

రాష్ట్రంలో సకలజనుల సంపద పెరిగి ఆనందంగా ఉన్నారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ అన్నారు.  సంపద పెరిగింది కాబట్టి గ్రామాలు ఆనంద నిలయలుగా మారాయని చెప్పారు. ప్రతి రంగాన్ని సిరుల రంగంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  వెయ్యికి పైగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు.

ఈ  8 ఏళ్లలో కేంద్రం సహకరించకపోయిన కేసీఆర్ అన్ని అడ్డంకులను అధిగమించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆంజనేయ గౌడ్ కొనియాడారు. క్రీడా రంగానికి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగాన్ని దేశానికే తల మానికంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తానని ఆంజనేయ గౌడ్ అన్నారు.