
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతల అవగాహన లేని మాటలు బాధ కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందుతుంటే.. బీజేపీ నేతలకు ఆ విషయం మింగుడుపడటం లేదని అన్నారు. కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ రాష్ట్రం సొంత డబ్బులతో ప్రాజెక్టును నిర్మించిందన్నారు.
ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రత్యేకంగా చేసిన సాయం ఏం లేదని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చే అనుమతులే ప్రాజెక్టుకు ఇచ్చిందన్నారు. అదీ కూడా తమ వల్లే వచ్చాయని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనుమతులు ఇవ్వకపోవడానికి తెలంగాణ దేశంలో లేదా ? అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారమున్నా.. వాటిలో ఎలాంటి పురోగతి లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని అనుమతులున్నా అక్కడ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని తెలిపారు. గుజరాత్ లో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టారా ? అని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
బీజేపీ నేత లక్ష్మణ్ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే పెద్దగా మాట్లాడుతున్నారని, తాము రికార్డు స్థాయి లో 32 జడ్పీ లను గెలిచామని.. దానికెలా స్పందిస్తారని అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ,పరిషత్ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోదా ? అని అడిగారు. తెలంగాణ లో పిరాయింపుల పై మాట్లాడుతున్న బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎందుకు చేర్చుకుంటున్నారు ? అని ప్రశ్నించారు. ఇక్కడ కూడా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీజేపీ లో చేరుతారంటున్నారు ..మరి ఎందుకు చేర్చుకుంటున్నారన్నారు.
ఒక్కసారి నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ రాకపోతే బీజేపీ రాజకీయం చేస్తోందని, నాలుగు సార్లు సమావేశానికి వెళ్లిన కేసీఆర్ కు, తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణకు నిధులు సాధించడం లో ఆ పార్టీ నేతలు శ్రద్ద పెట్టాలన్నారు.