వాళ్ల ధ్యాసంతా అధికారం కోసమే.. ప్రజల కోసం కాదు

వాళ్ల ధ్యాసంతా అధికారం కోసమే.. ప్రజల కోసం కాదు

తనను బర్తరఫ్ చేయాలంటున్న నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో ప్రజలకు తెలుసని, వాళ్ల ధ్యాసంతా అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వస్తున్న ఆరోపణలపై స్పందించారు. పార్టీలు మారుతున్న నాయకులకు అధికార దాహం తప్ప ... ప్రజాసేవపై దృష్టి ఉండదన్నారు. తెలంగాణ గురించి కొట్లాడని వాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీలకు ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ఇవ్వడమే కాకుండా మహనీయుల జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. బీసీలంటే ఎవరికి కసి, పగ ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో శనివారం నిర్వహించిన 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరపడం.. అక్కడే ఉన్న జిల్లా ఎస్పీ గన్ పైకి పెట్టాలని మంత్రి సూచించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. తాను పేల్చిన గన్ లో బుల్లెట్ లేదని, సౌండ్ కోసమే డమ్మీ గన్ పేల్చానని ఆయన స్పష్టం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, మంత్రవర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.