చావడానికైనా..చంపడానికైనా సిద్ధం : మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌

చావడానికైనా..చంపడానికైనా సిద్ధం : మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌

చావడానికైనా..చంపడానికైనా సిద్ధం
కోట్లాది మంది సైన్యం కేసీఆర్‌‌ వెంట ఉన్నది: శ్రీనివాస్‌‌ గౌడ్‌‌
పిట్ట బెదిరింపులకు.. తాటాకు చప్పుళ్లకు భయపడుతమా?
బీఆర్‌‌ఎస్‌‌ సింగిల్‌‌గానే పోటీ చేస్తదని వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తెలంగాణలో కోట్లాది మంది కేసీఆర్‌‌‌‌ వెంట ఉన్నారని, ఆయన కోసం చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ అన్నారు. ‘‘తెలంగాణ కోసం ఆ రోజు కేసీఆర్‌‌‌‌ ఒక్కడిగా బయల్దేరిండు.. లక్షలాదిగా ఆయన వెంట నడిచిన్రు.. ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నరు.. అప్పుడే భయపడలే.. ఇప్పుడు వాళ్ల పిట్ట బెదిరింపులకు.. తాటాకు చప్పుళ్లకు భయపడుతమా? ప్రాణాలకు తెగించి పోరాటం చేసే శక్తి మనకుంది.. లొంగిపోయేటోళ్లం కాదు మనం.. అవసరమనుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమే అనే వ్యక్తులం. త్యాగాలు చేసే వ్యక్తులం. తెలంగాణ ఆగం కావాలని, స్కీములన్నీ నాశనం కావాలనీ, మళ్లీ వాళ్ల చెప్పుచేతుల్లోకి రావాలని.. ఎనుకటి మాదిరిగా వాళ్ల ముందట చేతులు కట్టుకొని నిలబడాలని కుట్రలు చేస్తున్నరు’’ అని ఆరోపించారు. గురువారం ఎల్‌‌‌‌బీ స్టేడియంలో శాట్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా ఈడిగ ఆంజనేయ గౌడ్‌‌‌‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో పనిచేసిన తాను మంత్రినయ్యానని, కొందరు చైర్మన్లు అయ్యారని, అలాగే అందరికీ పదవులు వస్తాయని చెప్పారు. త్వరలోనే క్రీడా పాలసీ తీసుకువస్తామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఏమీ చదువుకోని వాళ్లను హెల్త్‌‌‌‌ మినిస్టర్లు చేశారని, అవగాహన లేని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. కానీ కేసీఆర్‌‌‌‌ అన్ని అంశాల మీద పట్టున్న వారికే పదవులు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌తో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పొత్తు అనేది 2023 జోక్‌‌‌‌ అని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సింగిల్‌‌‌‌గానే పోటీ చేస్తుందని, తమకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాణిక్కం ఠాగూర్‌‌‌‌ను తప్పించడం కాంగ్రెస్‌‌‌‌ అంతర్గత వ్యవహారమని, పొత్తులపై వాళ్లు ఏమైనా చర్చించుకోవచ్చని, దానితో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. పోలవరం విషయంలో కేసీఆర్‌‌‌‌ విశాల దృక్పథంతో పనిచేస్తారన్నారు.

ఉద్యమకారుడికి దక్కిన గౌరవమిది : ఎమ్మెల్సీ కవిత

ఆంజనేయ గౌడ్‌‌కు పదవి ఇవ్వడం సోదరిగా తనకు గర్వంగా ఉందని, ఉద్యమకారుడికి దక్కిన గౌరవం ఇది అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌తో భుజం కలిపి పనిచేసిన వారికి సముచిత గౌరవం దక్కుతోందన్నారు. అందరికీ ప్రజలకు సేవ చేసే అవకాశం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకొని అభివృద్ధి వైపు వెళ్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మించుకున్నామని, ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్‌‌ ప్లేయర్స్‌‌ను తయారు చేసేలా ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. శాట్స్‌‌ చైర్మన్‌‌గా బాధ్యతలు చేపట్టిన ఆంజనేయ గౌడ్‌‌ను మంత్రులు శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, కవిత తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ క్రీడారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేలా పనిచేస్తానన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన, బలహీన వర్గాల వ్యక్తినైన తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.