గొర్రెల సంఖ్యలో  దేశంలోనే తెలంగాణ ఫస్ట్‌‌‌‌

గొర్రెల సంఖ్యలో  దేశంలోనే తెలంగాణ ఫస్ట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గొర్రెల సంఖ్యలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అన్నారు. రూ. 5 వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితాలు ఇచ్చిందని.. రెండో విడత పంపిణీకి రూ. 6 వేల కోట్లు విడుదల చేశామని తెలిపారు. ధరలు పెరగడంతో యూనిట్‌‌‌‌ ధరను రూ. 1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచామన్నారు. శనివారం ఎంసీఆర్‌‌‌‌ హెచ్‌‌‌‌ఆర్డీలో రెండో విడత గొర్రెల పంపిణీపై మంత్రి సమీక్షించారు. మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తే వాటికి 1.30 కోట్ల పిల్లలు పుట్టాయని తెలిపారు. వాటి విలువ రూ.7,800 కోట్లు ఉంటుందన్నారు. 93 వేల టన్నుల మాంసం ఉత్పత్తి చేశామని చెప్పారు. పెరిగిన జీవాల సంఖ్యకు అనుగుణంగా గ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలని, రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందజేయాలని అన్నారు. పంపిణీ చేసే గొర్రెలకు ఇన్సూరెన్స్‌‌‌‌ పత్రాలు అందజేయాలని చెప్పారు. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్‌‌‌‌ క్లెయిమ్‌‌‌‌ కాక కాపరులు నష్టపోతున్నారని, 10 రోజుల్లోగా క్లెయిమ్‌‌‌‌ చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాల్లో గొర్రెల మార్కెట్‌‌‌‌ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈనెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని, కార్యక్రమాన్ని గజ్వేల్‌‌‌‌లో ప్రారంభిస్తామని తెలిపారు.