ఇళ్లు డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత మాదే : తలసాని

ఇళ్లు డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత మాదే : తలసాని

రాంగోపాల్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి సహాయకచర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్న ఆయన.. బిల్డింగ్ లో చిక్కుకుపోయిన ముగ్గురిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. మంటలు, పొగ కారణంగా ఇబ్బందిపడుతున్న చుట్టుపక్కల బస్తీవాసుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బిల్డింగ్  కూల్చివేత సమయంలో బస్తీవాసుల ఇండ్లకు డ్యామేజ్ జరిగితే పూర్తి బాధ్యత తమదేనని మంత్రి స్పష్టం చేశారు.

నిట్ సిబ్బంది శుక్రవారం బిల్డింగ్ పరిశీలించారని సాయంత్రానికి స్టడీ రిపోర్ట్ ఇస్తారని మంత్రి తలసాని చెప్పారు. గతంలో అయ్యప్ప సొసైటీలో బిల్డింగ్ కూల్చివేతకు ఉపయోగించిన కొత్త టెక్నాలజీ ఇప్పుడు కూడా వాడుతామని చెప్పారు. బిల్డింగ్ లోపల చిక్కుకుపోయిన వారి గురించి ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. పొగ కారణంగా అసలు లోపల ఏమీ కనిపించడం లేదని, అలాంటప్పుడు మీడియాలో డెడ్ బాడీ దొరికిందని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ నెల 25న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి జనావాసాల మధ్య ఉన్న వ్యాపార సముదాయలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని తలసాని ప్రకటించారు.