వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినం

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినం

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పండుగలను రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలకు సూచించారు. పండుగలను నిర్వహించడం ప్రభుత్వంగా బాధ్యతన్న ఆయన.. 3 నెలల ముందే వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. 

కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు ఇబ్బందిపడ్డాం కానీ.. ఈసారి మాత్రం  వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని వినాయక ఆర్గనైజర్ లను తాను కోరేది ఒక్కటేనని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఎవరు ఇబ్బందులు పడాల్సిన పనిలేదని చెప్పారు. ఎవరి ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రభుత్వం మీద బురద చల్లడం మానుకోవాలని అన్నారు.

కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో పండుగలను గొప్పగా జరుపుకోవాలని నిర్ణయించారని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రంలో వినాయక చవితి పండుగని జరిపినట్టుగా మరెక్కడా కూడా జరపరని తెలిపారు. సమైక్యతను ప్రతిబింబిచేలా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని తలసాని అభిప్రాయపడ్డారు.