ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జహీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో హాట్సన్ ఆగ్రో లిమిటెడ్ ఏర్పాటు చేసిన చాక్లెట్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే శంషాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం భారీ డైయిరీ యూనిట్​ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. జహీరాబాద్​ ప్రాంతంలో హాట్సన్ ఫ్యాక్టరీ రావడంతో చాలా మంది రైతులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్​ రంజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆధునిక పద్ధతుల వల్ల  వ్యవసాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. తెలంగాణలో 30కి పైగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎస్పీ రమణ కుమార్ పాల్గొన్నారు.

విత్తనాలకు ఇబ్బంది ఉండొద్దు 

సిద్దిపేట రూరల్, వెలుగు : విత్తనాలు, ఎరువుల విషయమై రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధా క్రిష్ణశర్మ అన్నారు. గురువారం జడ్పీ ఆఫీస్ లో 2, 3, 4 స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు.  వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్యం పై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా?  లేవా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశువులకు వస్తున్న ముద్ద చర్మ వ్యాధి పై వివరాలను తెలుసుకొని, టీకాలను వేయాలని సూచించారు. చేపపిల్లల పంపిణీలో చనిపోయిన చేపపిల్లలు కూడా వస్తున్నాయని, అలా జరగకుండా తగు జాగ్రతలు  తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ లు శ్యామల నాగరాజు, సుకూరి లక్ష్మి, శెట్టి మల్లేశం, గిరి కొండల రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సలీం పాల్గొన్నారు.

దుబ్బాకను అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్​ రావు
దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. తాను గిట్టని వారెన్నీ అన్నా, టీఆర్ఎస్​లీడర్లు చిల్లర రాజకీయాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి.. ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకోస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఈ రెండేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.  గత పాలకుల కాలంలో ఆగిపోయిన వంద పడగల ఆసుపత్రి, డబుల్​ బెడ్​రూమ్, షాపింగ్​ కాంప్లెక్స్​, మార్కెట్​, నియోజకవర్గంలోని పలు రోడ్లకు నిధులు సాధించి  అభివృద్ధిలో పరుగులు పెట్టించానని వివరించారు. రూ.5 లక్షలు పెట్టి దుబ్బాకకు రింగ్​ రోడ్డుకు సంబంధించిన మాస్టర్​ ప్లాన్​ రూపొందించామని,  త్వరలో అనుమతులు వస్తాయని తెలిపారు. చేపట్టబోయే పలు పనులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధుల గురించి వివరించారు. సోషల్​ మీడియా  ద్వారా టీఆర్​ఎస్​నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో తొలి సీఎం దళితుడని, భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి,  ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని, కాంట్రాక్ట్​ ఉద్యోగులందరిని పర్మినెంట్​ చేస్తానన్నా సీఎం కేసీఆర్​  హామీలను మరిచిపోయారన్నారు. అంతకు ముందు పలువురు లీడర్లు ఆయనను సన్మానించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​ గౌడ్, ఎస్​ఎన్​చారి, కర్నె పాండు, మట్ట మల్లారెడ్డి, చిక్కుడు చంద్రం, చింత సంతోష్​​, విభీషణ్​ రెడ్డి, మచ్చ శ్రీనివాస్​, పుట్ట వంశీ, భిక్షపతి, సంపంగి అశోక్, సంకోజి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలని ధర్నా
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: పెండింగ్​ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం హుస్నాబాద్​లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్​ రవీందర్​ మాట్లాడుతూ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న ప్రభుత్వం 
స్టూడెంట్స్​కు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యం వీడి వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 

బయో మెడికల్ కంపెనీ ఏర్పాటుపై నిరసన
మెదక్ (మనోహరాబాద్), వెలుగు: కూచారం గ్రామంలో బయో మెడికల్ కంపెనీ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం రాత్రి గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ‘బయో మెడికల్ కంపెనీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో అవస్థలు పడుతున్నామని, కొత్తగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కెమికల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఈ కంపెనీ ఏర్పాటు అయితే పక్కనే ఉన్న దిల్లాయి, కూచారం తండాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. శాంతియుత పోరాటం కొనసాగిస్తామని, కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచిన మోడీ:మాజీ మంత్రి, బీజేపీ లీడర్ బాబుమోహన్‌
జోగిపేట, వెలుగు : రైతులకు మేలు చేయడానికి, వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పి.బాబు మోహన్‌ అన్నారు. మోడీ పర్యటనకు మద్దతుగా గురువారం జోగిపేట పట్టణంలో పీఎం కిసాన్‌ యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రెతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు దొరుకుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, లిక్కర్ స్కాం కేసులు బయటపడుతాయనే ఉద్దేశంతో  ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ కంపెనీని ప్రధాని జాతికి అంకితం చేసే కార్య క్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఈ నెల 12న తెలంగాణ జరిగే మోడీ పర్యటనను సక్సెస్​ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మఠం చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు సయ్య సాయి, వివిధ మండలాల అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఆనంద్ శర్మ, మధు రెడ్డి, రాజు, శేఖర్ గౌడ్, పండరి, నాయకులు కొత్త శ్రీనివాస్, గోవర్ధన్, శివ చందర్, జగన్నాథం, సుమన్ తదితరులు పాల్గొన్నారు.  

టోకన్ల ప్రకారమే వడ్లను తూకం వేయాలి:  మెదక్​ అడిషనల్​ కలెక్టర్ రమేశ్​
మెదక్​టౌన్, వెలుగు : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే  రైతులకు టోకెన్లు ఇచ్చి వాటి ప్రకారమే వడ్లను తూకం వేయాలని అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​​ఆఫీసర్లకు సూచించారు.  గురువారం నర్సాపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్​తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రైస్ ​మిల్లును  కౌడిపల్లి మండలం మహమ్మద్​ నగర్​లోని శ్రీనివాస్ రైస్ ఇండస్ట్రీని తహసీల్దార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్​సీఐ ఆఫీసర్లు మిల్లులను ఆకస్మికంగా పరిశీలనకు వచ్చినప్పుడు  ధాన్యాన్ని  లెక్కించడానికి వీలుగా బస్తాలు పేర్చుకోవాలని రైస్​మిల్లర్లకు సూచించారు. ఈ వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు  ఇప్పటి వరకు జిల్లాలో  374  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా 5,055 మంది రైతుల నుంచి  సుమారు రూ. 53 కోట్ల విలువైన  25,630 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.  21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని చెప్పారు. వేగంగా ట్యాబ్​ ఎంట్రీలు చేసి  రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో తహసీల్దార్​ ఆంజనేయులు, పీఏసీఎస్​ చైర్మన్ రాజు యాదవ్, డీటీవో సాధిక్, తదితరులు పాల్గొన్నారు.

ఆఫీసర్లతో  టెలికాన్ఫరెన్స్..
ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ గురువారం టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైస్​ మిల్లులో ధాన్యాన్ని వేగంగా అన్ లోడ్ చేసుకోవాల న్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తగిన సంఖ్యలో హమాలీలు, వాహనాలు, గోడౌన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులు, మండల ప్రత్యేకాధికారులు సమ న్వయంతో పనిచేస్తూ వచ్చే 20 రోజులలోగా ధాన్యం సేకరణ ముగించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ల సంఘం ప్రెసిడెంట్​ చంద్రపాల్ మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ ప్రమాణాలకనుగుణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపాలని, రైస్ మిల్లులలో స్థలాభావం వల్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల  
ధాన్యాన్ని బయటికి పంపాలని కోరారు.  టెలికాన్ఫరెన్స్​లో  డీఎస్​వో శ్రీనివాస్, డీసీవో కరుణ, డీఆర్​డీవో భీమయ్య  పాల్గొన్నారు. 

మెదక్​ మున్సిపల్ కమిషనర్​గా ఆశ్రిత్ ​కుమార్​
మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్ మున్సిపల్ కమిషనర్​గా ఆశ్రిత్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు  ఇక్కడ విధులు నిర్వహించిన  శ్రీహరి మున్సిపల్ డైరెక్టరేట్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆశ్రిత్​కుమార్​ గతంలో నర్సాపూర్, జోగిపేట మున్సిపల్​ కమిషనర్​గా పనిచేసి ప్రస్తుతం వెయిటింగ్​లో ఉన్నారు.