ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రఘునాథపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం 

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం రఘునాథపాలెం మండలంలో ఆయన పర్యటించారు. చిమ్మపూడి ఎస్సీ కాలనీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ.4.95 కోట్లతో చిమ్మపూడి నుంచి పండితాపురం సంత వరకు, రూ.1.50కోట్లతో చిమ్మపూడి నుంచి మంచుకొండ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో గుడిసెల్లో ఉండే నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం పక్కాగా అందించాలని చెప్పారు. బుగ్గ వాగు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా కార్యాచరణ చేపట్టామన్నారు.

 ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఆర్డీవో నరసింహా రావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ  పవార్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో అశోక్ కుమార్ పాల్గొన్నారు. 

ఖర్గే పర్యటనను సక్సెస్ చేయాలి.. 

ఈనెల 4న హైదరాబాద్ లో జరిగే మల్లికార్జున ఖర్గే పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సక్సెస్ చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అధ్యక్షతన పట్టణ, మండల, గ్రామ బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు  చేసి ఖర్గే పర్యటన విజయవంతంపై దిశా నిర్దేశం చేశారు. ఎంపీ  రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఏ స్థాయి నాయకుడైన ప్రజాభిమానం పొందాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. 

జై భీం, జై బాపు, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే 4న హైదరాబాద్ రానున్నారని తెలిపారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ లపై బీర్ఎస్ చేసే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, సెంటిమెంట్ తో మరో మారు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.