
హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని మీకు తెల్వదా..? కేంద్రం వల్ల యూరియా కొరత ఉంటే మాపై విమర్శలు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్‌ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని విమర్శించారు. యూరియా సప్లైలో నిర్లక్ష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. యూరియాపై బీఆర్ఎస్ నేతలది కపట నాటకమని.. బీఆర్ఎస్ నాటకాలను రైతులు నమ్మరని అన్నారు. అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం (ఆగస్ట్ 30) బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ముందుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు.. యూరియా సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తెలంగాణ సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ధర్నాలో హరీష్ రావు, కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆందోళనతో సచివాలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది.