- ఇప్పటిదాకా 2.63 లక్షల టన్నుల పత్తి సేకరించినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రానున్న యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు జమ చేయడానికి శాటిలైట్ ఇమేజరీ ఆధారిత సాంకేతిక వ్యవస్థ(శాటిలైట్స్ తీసిన ఫోటోలు, వీడియోల ద్వారా భూమిని కొలిచే టెక్నాలజీ)ను అమల్లోకి తీసుకురావాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతు భరోసా పంపిణీ సమయానికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బుధవారం సెక్రటేరియెట్ లో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి తదితరులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లు, యూరియా సరఫరా, గత రబీ జొన్న నిల్వలు, శాటిలైట్ మ్యాపింగ్‌లపై ప్రధానంగా చర్చించారు. రానున్న యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా కోసం క్టోబరు–డిసెంబరు మధ్య ప్రతి నెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల టన్నులు కావాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. మొత్తం 4 లక్షల టన్నులకుగాను ఇప్పటివరకు 3.05 లక్షల టన్నులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. మిగిలినవి త్వరలో వచ్చేలా కేంద్ర రసాయన శాఖతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు.
పత్తి కొనుగోళ్ల వేగం పెంచాలి
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల వేగం పెంచాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభమైన నేపథ్యంలో ఆలస్యం లేకుండా కొనుగోళ్లు జరపాలని, స్లాట్ బుకింగ్‌లో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గత యాసంగిలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్నను ఎక్కువ కాలం గోదాముల్లో నిల్వ ఉంచకుండా, మంచి ధర వచ్చిన వెంటనే తరలించాలన్నారు.
