మరో తుఫాన్ ముప్పు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు

మరో తుఫాన్ ముప్పు.. ఆ రెండు రోజులు  భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. సెన్యార్ తుఫాన్ తప్పిందనుకునే లోపే  ఈ అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ  వాయుగుండం తీవ్ర వాయుగుండగా మారి.. తుఫాన్ గా బలపడొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ  అధికారులు. ఈ తుఫాన్ ప్రభావంతో  నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఏపీలోని తిరుపతి, నెల్లూరు,ప్రకాశం,కడప,అన్నమయ్య,సత్యసాయి జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని తెలిపింది. అంతేగాకుండా తెలంగాణలోని పలు  జిల్లాలకు వర్ష సూచన చేసింది. 

తప్పిన సెన్యార్ ముప్పు

 ఇప్పటికే  బంగాళాఖాతంలో సెన్యార్   తుఫాన్ గండం తప్పినట్లు పేర్కొంది వాతావరణ కేంద్రం.సెన్యార్ తుఫాన్ ఉత్తర ఇండోనేషియా వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రైట్ ఆఫ్ మలక్కా, దాని సమీపంలోని ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది.  ఈ తుఫాన్‌ ఇండోనేషియా దగ్గర  తీరం దాటింది.  పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మలుపు తిరిగి తూర్పు దిక్కులో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలు  తుఫాను ముప్పు నుంచి బయటపడ్డాయని తెలిపారు.