వనపర్తి, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం ఉదయం 10 గంటల కల్లా నోటిఫికేషన్ పబ్లిష్ చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని, నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరినే లోపలికి అనుమతించాలని చెప్పారు. నిర్దేశించిన పత్రాలు తీసుకురాకుంటే.. నామినేషన్ ను తిరస్కరించకుండా వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎఫ్ఎస్ టీ, స్టాటిస్టిక్ సర్వేలైన్స్ టీంలను, 4 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 5 మండలాలకు సంబంధించి 87 జీపీలు, 780 వార్డులకు గానూ 30 క్లస్టర్లలో ఆర్వో ఆఫీసులను ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్కలెక్టర్లు ఖీమ్యా నాయక్, యాదయ్య, ఎస్పీ సునీతా రెడ్డి, ఆర్డీవో సుబ్రమణ్యం, డీపీవో తరుణ్ చక్రవర్తి , డీఎస్పీ వెంకటేశ్వర రావు, జడ్పీ డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
