
- సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాదిలోనే ఐదు నియోజకవర్గాలకు సాగునీరు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
సత్తుపల్లి, వెలుగు : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులను శుక్రవారం మంత్రి పరిశీలించారు. అనంతరం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్ వి.పాటిల్, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, సీతారామ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం కింద మెయిన్ కెనాల్, మూడు పంప్ హౌస్‌లు ఇప్పటికే సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయని చెప్పారు. వానాకాలంలో గోదావరి జలాలు దుమ్ముగూడెం వచ్చే సమయంలో వైరా ప్రాజెక్ట్, తుమ్మలపల్లి వద్ద మారేడుపాక ఎత్తిపోతలను ప్రారంభించి 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. యాతాలకుంట టన్నెల్ ఇప్పటికే 1.2 కిలోమీటర్లు పూర్తి అయిందని, మిగిలిన 600 మీటర్ల పనులను స్పీడ్‌గా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆక్వా డక్ట్‌లు, ఇతర నిర్మాణాలను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని, భూ సేకరణలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వైరా ప్రాజెక్ట్ కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందని, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు రాకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ ఎ. శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి
ములకలపల్లి/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్ కాల్వల్లో జూన్ 15 నాటికి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మదారం సమీపంలో ఇటీవల సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిన ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. పిల్లర్ పనులను స్పీడ్‌గా చేయాలని ఆదేశించారు.
న్ నాటికి కాల్వలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి చిన్న, మధ్య తరహా చెరువులు, ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్ట్ కాల్వల ద్వారా నింపుతామని ప్రకటించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అన్నదైవం రెవెన్యూ పరిధిలో నిర్మించనున్న సీతారామ 9వ ఫేజ్ పనులు పరిశీలించారు.