
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. గురువారం కేఎంసీ పరిధిలోని 37వ డివిజన్ లో మున్సిపల్ సాధారణ నిధులు రూ. 175 లక్షలతో రైల్వే స్టేషన్ దగ్గరలో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు పాల్గొన్నారు.
ప్రతిసారి వరి వేయకండి
తల్లాడ : ప్రతిసారి వరి వేయకుండా మొక్కజొన్న, పామాయిల్ తదితర పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు రైతులకు సూచించారు. గురువారం సత్తుపల్లి వెళ్లే క్రమంలో ఆయన తల్లాడలో ఆగారు. ఈ సందర్భంగా గోదావరి జలాలు తల్లాడ మండలానికి చేరుకున్నందున రైతులు మంత్రికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు కాపా సుధాకర్, జక్కంపూడి కిషోర్, రాయల రాము, దగ్గుల రఘుపతి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.