కామారెడ్డి, వెలుగు : ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు సూచించారు. శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మాస్ ఫ్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని సబ్సిడీ పరికరాలను రైతులకు అందించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. అయిల్ పామ్ సాగులో అంతర్ పంటలను కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ మిల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేసి 14 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ మిషన్ వంట నూనెలు - ఆయిల్ పామ్ స్కీమ్, మన రాష్ర్ట ప్రభుత్వం కో ఆర్డినేషన్‌తో హార్టికల్చర్ శాఖ ద్వారా కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ( హెచ్‌యూఎల్)కు బాధ్యతలు అప్పగించామని మంత్రి తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడేలా కంపెనీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నాయన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేయటం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ పాల్గొన్నారు.
మంత్రి తుమ్మలతో షబ్బీర్‌అలీ భేటీ
కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ తోటల ప్లాంటేషన్‌కు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజక వర్గంలో మరో 2 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సాగు నీటి సమస్య పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, ఎరువుల లభ్యత, విత్తనాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం తదితర అంశాలను మంత్రికి వివరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్పర్సన్
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి కలిసి సన్మానించారు.
