రైతులకు ఇబ్బంది కలగొద్దు..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

రైతులకు ఇబ్బంది కలగొద్దు..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
  • ఎల్‌‌నినో నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి 
  • అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎల్‌‌నినో నేపథ్యంలో జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సోమవారం అగ్రికల్చర్ సెక్రటరీ, డీఏవోలు, ఏడీఏలు, ఎంఏవోలుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నాటికి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే అమలు చేయాల్సిన తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణకు సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని చెప్పారు.

ఐఎండీ అంచనాల ప్రకారం ఎల్‌‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందనే సంకేతాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభినట్లు తెలిపారు. రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు వాతావరణ సలహా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 18 జిల్లాలకు చెందిన దాదాపు 28 లక్షల మంది రైతులకు మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర వాతావరణ వివరాలను వాట్సాప్ ద్వారా నేరుగా చేరవేస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లాల్లో వర్షపాతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు అందించాలని, దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్, హార్టీకల్చర్, పశుసంవర్థక, సహకార శాఖలతో పాటు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో రైతులకు అవసరమైన సహాయాన్ని అందించాలని మంత్రి సూచించారు.

..