
మహబూబ్ నగర్: వచ్చే ఆరు నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు- రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్‌కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రేపు (సెప్టెంబర్ 26) సాయంత్రం లోగా స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్‌కు అందజేయాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 25) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో వెనుకబడిన జిల్లా, వలసలకు పేరున్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నామని స్పష్టం చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వందకు వంద శాతం పూర్తి చేస్తామని జిల్లా ప్రజలకు హమీ ఇస్తున్నామని.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం గత ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టును స్థిరీకరించిందని కానీ మేం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును స్థిరీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.