ధాన్యం దిగుబడిలో రికార్డు సృష్టిస్తున్నం..1.48 కోట్ల టన్నుల వడ్లు పండుతయ్: ఉత్తమ్

ధాన్యం దిగుబడిలో రికార్డు సృష్టిస్తున్నం..1.48 కోట్ల టన్నుల వడ్లు పండుతయ్: ఉత్తమ్
  • వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు
  • క్వింటాల్ సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తం
  • సివిల్ సప్లై ఆఫీసర్లతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వరి దిగుబడిలో రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడి రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఇంత ధాన్యాన్ని పండించలేదని అన్నారు. సివిల్ సప్లయ్స్ భవన్​లో మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

తెలంగాణ సాధించిన అభివృద్ధి.. ధాన్యం దిగుబడి రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 40.75 లక్షల ఎకరాల్లో సన్న రకం, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం పంట సాగు చేశారు. 90.46 లక్షల టన్నులు సన్నాలు, 57.84 లక్షల టన్నులు దొడ్డు రకం బియ్యం దిగుబడి వస్తున్నది. రికార్డు స్థాయిలో మొత్తంగా 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది’’అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

బియ్యం సబ్సిడీని కేంద్రం రిలీజ్ చేయాలి

80 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘కనిష్ట మద్దతు ధరతో ఈ కొనుగోళ్లకు రూ.21,112 కోట్లు అవసరం. ఇందులో రైతులకు నేరుగా చెల్లించేందుకు రూ.19,112 కోట్లు ఖర్చు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ కింద చెల్లించాల్సిన రూ.6,500 కోట్లను వెంటనే విడుదల చేయాలి. క్వింటాల్ సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తాం. 

వానాకాలం, యాసంగి పంటలకు బోనస్ కోసం సుమారు రూ.3,159 కోట్లు అవసరం. రైతులు పండిస్తున్న సన్న రకం వడ్లకు ఇంటర్నేషనల్​గా గిరాకీ ఉంది. ముఖ్యంగా ఫిలిప్పిన్స్​లో చాలా డిమాండ్ ఉంది. ధాన్యం నిల్వ చేసేందుకు రాష్ట్రంలో గోదాముల కొరత ఉంది. ఎఫ్​సీఐ గోదాముల్లో 0.89 లక్షల టన్నుల నిల్వ స్థలమే ఖాళీగా ఉంది. బాయిల్డ్ రైస్​ను ఇతర రాష్ట్రాలకు రవాణా చేయకపోవడంతో గోదాములు నిండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బాయిల్డ్ రైస్​ను ట్రాన్స్​పోర్ట్ కు అదనపు రైళ్లు కేటాయించాలి’’అని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాగా, 2019-–20లో 72 లక్షల టన్నుల నుంచి 2025–26లో 148.30 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది.