సివిల్‌‌ సప్లయ్స్‌‌లో 56 వేల కోట్ల నష్టం

సివిల్‌‌ సప్లయ్స్‌‌లో 56 వేల కోట్ల నష్టం
  • ఏటా మిత్తీలే 3,645 కోట్లు కట్టాల్సి ఉంది: ఉత్తమ్​ 
  • బ్యాంకు ష్యూరిటీ తప్ప డబ్బులివ్వని గత పాలకులు
  • అన్ని కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్న మంత్రి 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సివిల్​సప్లయ్స్​శాఖ రూ.56 వేల కోట్ల నష్టంలో కూరుకుపోయిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి గత పాలకులే కారణమని విమర్శించారు.

బ్యాంకులకు ష్యూరిటీ ఇవ్వడం తప్ప సివిల్ సప్లయ్స్‌‌శాఖకు గత ప్రభుత్వం పైసా ఆర్థిక సాయం చేయకపోవడంతోనే వేలకోట్ల అప్పులు పెరిగాయన్నారు. ఏటా రూ.3,645.25 కోట్లు మిత్తీలకే పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు గ్యారంటీలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వరికి 500 రూపాయల బోనస్‌‌లను100 రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు.

500 రూపాయలకే గ్యాస్‌‌ సిలిండర్‌‌ అందించడానికి ఏడాదికి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అవసరమన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌‌లో పౌరసరఫరాల శాఖపై రివ్యూ నిర్వహించిన మంత్రి.. అధికారులను వివరాలు  అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్​కుమార్ ​రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబరు 31 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,256 కోట్లు ఇవ్వాల్సి ఉందని, దీనిపై ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామని తెలిపారు. గతంలో సేకరించిన1.30 లక్షల టన్నుల ధాన్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్ల విలువైన 88 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉందన్నారు. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు. 

ఫైనాన్స్​మిస్​మేనేజ్​మెంట్​

బీఆర్ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఫైనాన్స్‌‌‌‌ మిస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ చేసిందని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఇంధనశాఖ రూ.81వేల కోట్ల అప్పుల్లో  ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులవే రూ.10 వేల కోట్ల బాకీలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని తెలిపారు. సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ ధాన్యం సేకరణ కోసం రూ.50 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇలా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌‌‌‌లను ఫైనాన్స్‌‌‌‌ మిస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ చేసిందని ఆరోపించారు.

పేదలకు తినగలిగే బియ్యం ఇవ్వాలి

పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తమ్​కుమార్​ చెప్పారు. రాష్ట్రంలో 89,98,546 రేషన్‌‌‌‌ కార్డులు ఉండగా 2 కోట్ల 90 లక్షల మంది రేషన్‌‌‌‌ లబ్ధిదారులున్నారని తెలిపారు. మరో 11.02 లక్షల కొత్త రేషన్‌‌‌‌ కార్డుల అప్లికేషన్‌‌‌‌ లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. కొత్త రేషన్‌‌‌‌కార్డు దరఖాస్తులపై ముఖ్యమంత్రితో కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యంలో నాణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాణ్యమైన తినగలిగే బియ్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలు ఉన్నాయని, ఉన్న రేషన్‌‌‌‌ కార్డుదారుల్లో11 శాతం మంది వినియోగదారులు రేషన్‌‌‌‌కార్డులు ఉపయోగించలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి అన్నారు. ధాన్యం సేకరణపై రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు  వెంటనే వారి అకౌంట్‌‌‌‌లలో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.