
గజ్వేల్, వెలుగు: కన్నతండ్రికి కూతురు కొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బండ్ల సత్యనారాయణ(40) వ్యవసాయం చేస్తూ భార్య కవిత, ముగ్గురు కూతుళ్లు కల్యాణి(18), ఉమ(15), శ్రావణి(13)లను పోషిస్తున్నాడు. రెండేళ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణ వెన్నుపూసకు గాయమై మంచానపడ్డాడు. అప్పటి నుంచి కొంత భూమి విక్రయించి వైద్యం చేయించినా నయం కాలేదు.
.మరి కొంత భూమి విక్రయించి ఇటీవలే పెద్ద కూతురు వివాహం జరిపించారు. కొంత కాలంగా కిడ్నీలు పాడై ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో బుధవారం సత్యనారాయణ మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. శుక్రవారం నిర్వహించి సత్యనారాయణ అంత్యక్రియల సందర్భంగా చిన్న కూతురు శ్రావణి కొరివిపట్టి అంత్యక్రియలను పూర్తి చేసింది. దీన్ని చూసిన గ్రామస్తులు చిన్నారికి ఎంత కష్టమొచ్చిందని కంటతడిపెట్టారు.