ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను  తాకట్టు పెట్టిందే మీరు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రగతి భవన్​లో జగన్​తో విందు రాజకీయాలు చేసిందెవరు?: మంత్రి ఉత్తమ్
  •     ప్రగతి భవన్​లో జగన్​తో విందు రాజకీయాలు చేసిందెవరు?
  •     రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా?
  •     బేసిన్లు లేవు, భేషజాల్లేవని జగన్​తో చెప్పలేదా?: మంత్రి ఉత్తమ్​
  •     లక్ష కోట్లు కాళేశ్వరానికే తగలెట్టారని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: విందుల పేరుతో తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్  చీఫ్  కేసీఆర్ ​అని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన జూమ్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రగతి భవన్​లో ఏపీ మాజీ సీఎం జగన్​తో విందు రాజకీయాలు చేసిందెవరు? గోదావరి జలాలను తెలంగాణ నుంచి తీసుకెళ్లి రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్​ ప్రకటించలేదా? ‘బేసిన్లు లేవ్​.. భేషజాల్లేవ్​’ అని కేసీఆర్  చెప్పలేదా?” అని ఉత్తమ్  ప్రశ్నించారు. రోజా ఇంటికెళ్లి కేసీఆర్​ మాట్లాడిన మాటలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్  పదేండ్ల పాటు పాలించి నిలువుదోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పదేండ్లలో బడ్జెట్​ కోసం రూ.17 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో ఇరిగేషన్​కు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని, రూ.లక్ష కోట్లు ఒక్క కాళేశ్వరానికే పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్​ స్వయంగా డిజైన్​ చేయించి.. కట్టిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ వాళ్లు అధికారంలో ఉండగానే కుప్పకూలిందని గుర్తుచేశారు. లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేదని, ఐదేండ్లలో ఎత్తిపోసింది 160 టీఎంసీలేనని ఎద్దేవా చేశారు. దానిపై సిగ్గుపడాల్సింది పోయి సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. ఎత్తిపోసిన 160 టీఎంసీల్లోనూ 60 నుంచి 70 టీఎంసీలే వాడారని, మిగతా నీళ్లన్నీ సముద్రంపాల్జేశారని చెప్పారు. ఆ 70 టీఎంసీలతో 17 లక్షల ఎకరాలకు నీళ్లెలా ఇచ్చారో హరీశ్  రావు లెక్క చెప్పాలన్నారు. ఇరిగేషన్​ శాఖను దోపిడీ వ్యవస్థగా మార్చారని, శాఖను సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు. పదేపదే అబద్ధాలు చెబితే తెలంగాణ సమాజం నమ్ముతుందన్న భ్రమలో బీఆర్ఎస్​ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వచ్చిన మొదలు.. గత రెండేండ్లలోనే కృష్ణా జలాల్లో ఎక్కువ వినియోగం జరిగిందన్నారు. ఈ రెండేండ్లలోనే ఎక్కువ పంట పండిందని చెప్పారు. 

ఒక్క చుక్కనూ వదులం

కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని మంత్రి ఉత్తమ్​ తేల్చి చెప్పారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకే  నీటి హక్కులను కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్​ చేసిన పొరపాట్లను సరిచేస్తున్నామన్నారు. బచావత్​ ట్రిబ్యునల్​ ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 811 టీఎంసీల కేటాయింపుల్లో.. ఏపీకి 512 టీఎంసీలు రాసిచ్చారని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు చేయలేదా అని నిలదీశారు. కేసీఆర్​ సీఎంగా, హరీశ్​ ఇరిగేషన్​ మంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం బ్రజేష్​ కుమార్​ ట్రిబ్యునల్​లో పోరాడుతున్నామన్నారు. అన్ని వేదికల్లోనూ పోలవరం నల్లమలసాగర్​ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లకు దానిని వ్యతిరేకిస్తూ లేఖలు రాశామన్నారు. కేంద్రంతో జరిగిన పలు సమావేశాల్లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించామని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ సూచనలతో పిటిషన్ ను వెనక్కితీసుకొని, ఒరిజనల్  సూట్ వేస్తున్నామన్నారు. పోలవరం-, నల్లమలసాగర్​ పీఎఫ్ఆర్​పై రెండు రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​కు లేఖ రాయగా.. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదంటూ లేఖ ద్వారా ఆయన సమాచారం ఇచ్చారని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్‌‌  నేతలు పదేపదే అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  

హరీశ్​ సలహాలు అవసరం లేదు

సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంపై హరీశ్​ రావు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మంత్రి ఉత్తమ్​ హితవు చెప్పారు. పోలవరం-, నల్లమలసాగర్​ను అజెండాలో చేర్చేందుకు వీల్లేదని సమావేశంలో అధికారులు చెప్పారని, అంతర్రాష్ట్ర వివాదాల వల్ల ఆగిన ప్రాజెక్టులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్పామని పేర్కొన్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులపై హరీశ్​ రావు సలహాలు అక్కర్లేదన్నారు. పదేళ్లపాటు నీటిపారుదల శాఖను, ప్రాజెక్టులను నాశనం చేసినోళ్లా సలహాలు ఇచ్చేదని నిలదీశారు. కాళేశ్వరంలో మేడిగడ్డను గుండెకాయగా ప్రచారం చేసుకున్నదే  బీఆర్​ఎస్​ అని, ఆ బ్యారేజీ కుంగిపోయిందని చెప్పారు. దేశంలో అత్యంత ప్రమాదకర డ్యామ్​లలో ఆ ప్రాజెక్టు ఒకటని లోక్​సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. బ్యూరోక్రాట్ల గురించి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకున్నది, జీఓలు జారీ చేసింది ఆదిత్యనాథ్ దాస్ అని, ఏపీ ప్రాజెక్టులపై పనిచేసింది ఎస్కే జోషి అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై పనిచేసిన ఆదిత్యనాథ్​ దాస్​ను బరాబర్​ ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంటే.. ఏపీ ప్రాజెక్టులపై పనిచేసిన ఎస్కే జోషిని బీఆర్ఎస్​ వాళ్లు నియమించుకున్నారని విమర్శించారు.