- సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్ పర్యవేక్షణలో రిపేర్లు చేపడతాం
- బ్యారేజీల నిర్మాణంలో రాజకీయ తప్పిదాలు, ఇంజనీరింగ్ లోపాలు
- అర్హత కలిగిన సంస్థకే పునరుద్ధరణ బాధ్యతలు అప్పగిస్తాం
- వరదలు తగ్గాక బ్యారేజీల వద్ద సీడబ్ల్యూపీఆర్ఎస్తో టెస్టులు
- మరో15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పూర్తి శాస్త్రీయ విధానంలో మరమ్మతులు చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఇలాంటి నాణ్యతలేని బ్యారేజీలను నిర్మించిందని, వాటికి బాధ్యతాయుతంగా రిపేర్లు చేసి వినియోగంలోకి తెస్తామన్నారు.
వ్యవస్థీకృత వైఫల్యాలు, అడ్డగోలు నిర్ణయాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు జరిగాయని విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణల్లో తేలిందన్నారు. రాజకీయ, ఇంజనీరింగ్ అధికారుల స్థాయిల్లో చాలా లోపాలు బయటపడ్డాయని చెప్పారు.
మూడు బ్యారేజీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణుల పర్యవేక్షణలోనే రిపేర్లు చేస్తామని స్పష్టం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణ పురోగతిపై మంత్రి ఉత్తమ్ బుధవారం సెక్రటేరియెట్‌లో అధికారులతో రివ్యూ చేశారు. దర్యాప్తు సంస్థలు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) పనితీరుపై వ్యతిరేక నివేదికలు ఇచ్చాయని, ఈ నేపథ్యంలోనే అర్హత కలిగిన టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్, కన్సల్టెంట్లను నియమించి బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్లు చేయించాలని నిర్ణయించామన్నారు.
‘‘బ్యారేజీల పునరుద్ధరణపై సీడబ్ల్యూసీ సలహాలు సూచనల కోసం విజ్ఞప్తి చేశాం. అనుభవం కలిగిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో డిజైన్లు చేయించాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఆ డిజైన్లకు ఆమోదం తెలుపుతామని చెప్పింది. ఆ క్రమంలోనే డిజైన్ల తయారీకి వివిధ సంస్థల నుంచి రిక్వెస్ట్స్ ఫర్ ప్రపోజల్స్‌ను పిలిచాం. పలు సంస్థలు స్పందించాయి. అయితే, ఐఐటీలతో టై అప్ లేదా ఫార్మల్ ఒప్పందం చేసుకునే సంస్థలకే ప్రాధాన్యం ఇస్తం. ప్రస్తుతానికి ఐదు సంస్థలను షార్ట్ లిస్ట్ చేసినం. డ్యామ్ సేఫ్టీలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థకే పునరుద్ధరణ బాధ్యత అప్పగిస్తాం’’ అని ఆయన తెలిపారు.
వరదలు తగ్గాక టెస్టులు..
వరదలు పూర్తిగా తగ్గాక సీడబ్ల్యూపీఆర్ఎస్తో జియోఫిజికల్, జియోటెక్నికల్, హైడ్రాలిక్ స్టడీస్ చేయిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఆ టెస్టుల రిజల్ట్స్ ఆధారంగా బ్యారేజీలకు జరిగిన డ్యామేజ్ తీవ్రతను తెలసుకుని, అనంతరం రిపేర్లు చేపడతామన్నారు. మరో15 నుంచి 20 రోజుల్లో టెస్టులను ప్రారంభిస్తామన్నారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ టెస్టుల డేటా ఆధారంగానే ఎంపికైన సంస్థ డిజైన్లు, కాస్ట్ ఎస్టిమేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
బ్యారేజీలను నిర్మించిన ఏజెన్సీలే రిపేర్ల ఖర్చును పూర్తిగా భరించాలని తేల్చి చెప్పారు. ‘‘బ్యారేజీల్లో డిజైన్ల లోపాలు, అసంపూర్ణమైన మోడల్ స్టడీస్, నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ నివేదిక తేల్చింది. క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్లానింగ్ సరిగ్గా లేదని జ్యుడీషియల్ కమిషన్ విచారణలో తేలింది. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫార్సు చేసింది’’ అని స్పష్టం చేశారు.
సమ్మక్కసాగర్ బ్యారేజీకి చత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీని త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సీతమ్మసాగర్, సీతారామ సాగర్, మోడికుంట వాగు, చనకా కొరాటా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులపైనా అధికారులతో చర్చించారు. ఆయా ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ నుంచి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సులను వేగవంతం చేయాలని చెప్పారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, రిజర్వాయర్లలో పూడికతీత వంటి అంశాలపైనా మంత్రి చర్చించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం, డిండి ప్రాజెక్టు పురోగతి, జూరాలకు ప్రత్యామ్నాయ వంతెన, సింగూరు కెనాల్ లైనింగ్ పనులనూ రివ్యూ చేశారు.
