
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. సీఎంపై వ్యాఖ్యలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మంగళవారం గాంధీభవన్ లో మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీలోని మహిళల మాటలకు కనీసం జవాబు చెప్పలేని వాళ్లు సీఎం రేవంత్ రెడ్డి సభకు మహిళల నుంచి స్పందన లేదనడంపైఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్‌పై జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో...18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఎలా ఉందో తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మహిళల నుంచి స్పందన రావడం బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ కుల గణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేబినెట్ ఆమోదం తెలిపి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు.