
- 18 నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశాం
- మంత్రి వాకిటి శ్రీహరి
అలంపూర్, వెలుగు : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి పేరుమీదే అన్ని స్కీమ్‌లు అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోందన్నారు. గురువారం అలంపూర్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏడాదికి ఒకసారి కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే, ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నామన్నారు.
పార్టీలకు అతీతంగా, అక్రమాలకు తావు లేకుండా ఇందిమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ చైర్మన్ దొడప్ప, వైస్ చైర్మన్ మచ్చర్ల కుమార్ పాల్గొన్నారు.
మంత్రి ఎదుట మాటల యుద్ధం
ఎమ్మెల్యే విజయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ముందుగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ రేషన్‌కార్డుల అప్లికేషన్‌కు కూడా నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కసారి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
స్పందించిన ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులకు, ఇంటి నిర్మాణానికి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఇసుక, మట్టి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రితో పాటు, డీఎస్పీ ఇరుపార్టీల లీడర్లకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.