చంద్రబాబుది దోచుకో, దాచుకో విధానం: మంత్రి విడుదల రజని

చంద్రబాబుది దోచుకో, దాచుకో విధానం: మంత్రి విడుదల రజని

ఏపీ మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో  కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగాయని గుర్తు చేశారు.  జగనన్న సీఎం అయిన తరువాత ఆస్పత్రుల్లో కాంతులు వెదజల్లుతున్నాయన్నారు మంత్రి విడుదల రజని.  

టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క కాలేజీ కూడా రాలేదన్న మంత్రి రజని... వైసీపీ హయాంలో   ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఈ ఏడాది కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు  ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రిలో ఉన్న ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆగస్టు నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.

వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే  17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. ప్రతి కాలేజీలో 150 ఎంబీబీయస్ సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో దీన్ని ఒక చరిత్రగా మంత్రి అభివర్ణించారు.