పాలిటెక్నిక్లను  ప్రైవేటీకరించం.. రూ.600 కోట్లతో కాలేజీలు అప్ గ్రేడ్ చేస్తం: విద్యార్థుల డౌట్లను క్లియర్ చేసిన మంత్రి

పాలిటెక్నిక్లను  ప్రైవేటీకరించం.. రూ.600 కోట్లతో కాలేజీలు అప్ గ్రేడ్ చేస్తం: విద్యార్థుల డౌట్లను క్లియర్ చేసిన మంత్రి
  •     ఎప్పటిలాగే బీటెక్ లో ల్యాటరల్ ఎంట్రీ
  •     ఫీజులు పెంచం.. రీయింబర్స్ మెంట్ ఇస్తం
  •     2 వేల చొప్పున స్టైపెండ్ కూడా ఉంటది
  •     మాసబ్ ట్యాంకులో విద్యార్థులతో 
  • కార్మిక శాఖ మంత్రి వివేక్ ముఖాముఖి
  •     విద్యార్థుల డౌట్లను క్లియర్ చేసిన మంత్రి
  •     ఫ్యాకల్టీ అడిగిన ప్రశ్నలకూ ఓపిగ్గా జవాబు


హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునీకరించి, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కార్మిక, శక్తి శాఖల ద్వారా దాదాపు రూ.600 కోట్ల నిధులను వెచ్చించి పాలిటెక్నిక్ కాలేజీల్లో మౌలిక వసతులను, ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో అప్​ గ్రేడ్​ చేస్తున్నామని తెలిపారు. 

గత పదేళ్ల కాలంలో సాంకేతిక విద్యా రంగాన్ని మునుపటి పాలకులు పూర్తిగా విస్మరించారని, తాము అధికారంలోకి రాగానే వేలాది ఉద్యోగాల భర్తీతో పాటు సాంకేతిక విద్య ప్రక్షాళనకు నడుం బిగించామని వివరించారు. ‘నో టూ శక్తి’ అంటూ ఫ్లకార్డులు పట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని, రూ.600 కోట్ల అభివృద్ధి నిధులు వద్దంటే సంస్థల పురోగతి ఎలా సాధ్యమో ఆలోచించాలని విద్యార్థులకు హితవు పలికారు. ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని, ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తుకు తాము బాధ్యత వహిస్తామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు.   సమస్యలు ఏమైనా ఉంటే ఒక్కొక్కటిగా చెప్పాలని,  చర్చించి పరిష్కారిస్తామన్నారు.  అవసరమైతే జీవోలో పొందుపర్చాల్సిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పాలని వాటిని పెట్టేందుకు సిద్దమని ప్రకటించారు.  హైదరాబాద్‌‌‌‌లోని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జీవో 97, ‘శక్తి’  వ్యవస్థపై ఆందోళన చెందుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలు, అపోహలను  ఓపికగా విని.. ఒక్కొక్క అంశంపై స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్టైఫండ్ వంటి అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు. అలాగేపాలిటెక్నిక్‌‌‌‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక విద్య, పరిశ్రమలతో అనుసంధానం, మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి – విద్యార్థుల మధ్య సంభాషణ ఇలా సాగింది. 


ప్రశ్న:  సర్టిఫికెట్‌‌‌‌కు విలువ తగ్గుతుందా? 
ఈసెట్ పరీక్ష, బీటెక్‌‌‌‌లోకి లేటరల్ ఎంట్రీ  వెళ్లగలమా?
మంత్రి: కచ్చితంగా ఈసెట్ పరీక్ష ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న విధానమే కొనసాగుతుంది. ఈసెట్ ద్వారా బీటెక్‌‌‌‌లో రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ పొందే అవకాశం కూడా కొనసాగుతుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అవసరమైతే దీనిపై స్పష్టత ఇస్తూ ప్రత్యేక జీవో కూడా తీసుకొస్తాం. సర్టిఫికెట్​ విలువ అసలు తగ్గదు. ప్రస్తుతం మీ డిప్లొమాకు ఉన్న గుర్తింపు, విలువ పూర్తిగా కొనసాగుతుంది. భవిష్యత్తులో ఆ విలువను మరింత పెంచాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మీకు మరిన్ని అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం.
ప్రశ్న: మా సిలబస్‌‌‌‌లో మార్పులు చేస్తారా?  
ఉద్యోగ అవకాశాలు ఎలా ?
మంత్రి: ప్రస్తుతం ఉన్న కోర్సులు కొనసాగుతాయి. అయితే, భవిష్యత్తులో కొత్త పరిశ్రమలు, కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ కొత్త కోర్సులను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఉన్న కోర్సులను తొలగించి మీపై బలవంతంగా కొత్త కోర్సులు రుద్దే పరిస్థితి ఉండదు. ఉద్యోగ అవకాశాలు  కూడా తగ్గవు. ఇంకా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాల స్వభావం మారుతోంది. అందుకే కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మీకు అందించాలనుకుంటున్నాం. దాని వల్ల మీకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.  
ప్రశ్న:  నిధులు ఎందుకు శక్తి శాఖ నుంచి రావాలి?
మంత్రి: పాలిటెక్నిక్‌‌‌‌ల అభివృద్ధికి నిధులు అవసరం. శక్తి శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ఆ శాఖ ద్వారా నిధులు సమకూర్చి పాలిటెక్నిక్‌‌‌‌లను అభివృద్ధి చేయాలన్నది మా ఆలోచన. శాఖ మారినంత మాత్రాన మీ విద్యలో మార్పు ఉండదు. పైగా మీకు అదనపు నిధులు, మెరుగైన సౌకర్యాలు అందే అవకాశం ఉంటుంది.
ప్రశ్న: భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం 
ఈ నిర్ణయాలను మార్చేస్తే మా పరిస్థితి ఏంటి?
మంత్రి: ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంగా మేము మీ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్న జీవోలు కొనసాగుతాయని అధికారులు కూడా స్పష్టం చేశారు. మీకున్న హక్కులు, భద్రత ఎక్కడా దెబ్బతినకుండా చూస్తాం. విద్యార్థులు కోరుకుంటూ ఏ అంశంపై స్పష్టత కావాలో చెప్పాలి. ఆమేరకు  అవసరమైన చోట జీవోలోనే నిబంధనలు పొందుపరుస్తాం. సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది, అనుమానం ఉంటే  నేరుగా సంప్రదించాలి. 

 ప్రశ్న: పాలిటెక్నిక్‌‌‌‌లను ప్రైవేటీకరణ చేస్తారని మాకు భయం ఉంది?
మంత్రి: ప్రైవేటీకరణ అనే ప్రశ్నే లేదు. పాలిటెక్నిక్‌‌‌‌లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. గవర్నమెంట్ కంట్రోల్‌‌‌‌లోనే విద్య, పరీక్షలు, ఫీజులు, విద్యార్థుల ప్రయోజనాలు కొనసాగుతాయి. పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నది ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక శిక్షణ, సీఎస్‌‌‌‌ఆర్ నిధులు తీసుకురావడం కోసం మాత్రమే. పరిశ్రమల నుంచి సీఎస్‌‌‌‌ఆర్ నిధులు, సాంకేతిక సహకారం తీసుకుని పాలిటెక్నిక్‌‌‌‌లను అభివృద్ధి చేస్తాం. మీ విద్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది.
 

ఫ్యాకల్టీ ప్రశ్న: మా స్టాఫ్ జీతాలు, 
సర్వీస్ కండిషన్స్‌‌‌‌లో మార్పులు వస్తాయా?
మంత్రి: ఎలాంటి మార్పులు ఉండవు. జీతాలు, ప్రమోషన్లు, సర్వీస్ కండిషన్స్ అన్నీ కొనసాగుతాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు. భవిష్యత్తులో అభివృద్ధి పెరిగితే మరిన్ని పోస్టులు, మరిన్ని ప్రమోషన్ అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై కూడా ఆలోచిస్తాం.

విద్యార్థుల ప్రశ్న: పాలిటెక్నిక్​లను ‘శక్తి’ శాఖలోకి మార్చడం వల్ల మా చదువులు, సర్టిఫికెట్లు, ఫీజులు, పరీక్షల్లో ఏమైనా మార్పులు వస్తాయా?
మంత్రి వివేక్ వెంకటస్వామి: ఎలాంటి మార్పులు ఉండవు. మీరు ప్రస్తుతం ఏ విధంగా చదువుతున్నారో అదే విధంగా కొనసాగుతుంది. ఏఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికెట్ అన్నీ కొనసాగుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఫీజు విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న ఫీజు నిర్మాణమే కొనసాగుతుంది. అంతేకాదు, విద్యార్థులకు స్టైపెండ్ అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మీపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూస్తాం. ప్రస్తుతం మీకు ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ విధానం కొనసాగుతుంది. పాలిటెక్నిక్​లను ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖ పరిధిలోకి వెళ్లడం వల్ల విద్యార్థులకు ఉన్న ప్రయోజనాలు తొలగిపోవు. ఇప్పటికే అడ్మిట్ అయిన విద్యార్థుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. మీరు ఏ కోర్సులో చేరారో అదే కోర్సును పూర్తి చేస్తారు. మీ పరీక్షలు, సిలబస్, సర్టిఫికెట్లు, ఫీజులు అన్నీ కొనసాగుతాయి.