
- కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి
- తెలంగాణలో మూడు ఐటీఐ హబ్‌లు ఏర్పాటు చేయాలని జయంత్ చౌదరికి వినతి
- రామగుండం ఈఎస్‌ఐ ఆస్పత్రి త్వరగా నిర్మించాలని మన్సుఖ్ మాండవీయకు రిక్వెస్ట్
- ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో వివేక్, వంశీకృష్ణ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. చెన్నూరు నియోజకవర్గంలోని జోడువాగుల రోడ్డుతో పాటు ఎన్‌హెచ్– 63 విస్తరణ పనులు ఏండ్లకేండ్లుగా ఆలస్యమవుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్‌హెచ్- 63 (నిజామాబాద్– జగ్దల్‌పూర్) తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్తున్నది. ఇది తెలంగాణలోనే దాదాపు 268 కి.మీ మేర విస్తరించి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి జైపూర్, చెన్నూరు, సిరోంచ వైపు రాకపోకలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఏడేండ్ల క్రితం చేపట్టిన ఈ హైవే విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. డీపీఆర్ దశలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు ఇరుకుగా మారడంతో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాలతో పాటు భీమారం–చెన్నూరు మండలాల మధ్య తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడండి. అలాగే జోడువాగుల వద్ద బ్రిడ్జికి రెండు వైపుల ఉన్న హైవే పెండింగ్ పనులు కూడా పూర్తయ్యేలా చొరవ చూపండి” అని కోరారు. కాగా, తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివేక్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా గడ్కరీకి వివేక్, వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయండి..
తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఐటీఐ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఎంపీ వంశీకృష్ణ, కార్మిక శాఖ సెక్రటరీ దానకిశోర్‌తో కలిసి జయంత్ చౌదరితో ఆయన సమావేశమయ్యారు. ‘‘యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి, వృత్తిపరమైన శిక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో 3 ఐటీఐ హబ్‌లను ఏర్పాటు చేయండి. స్థానిక పరిశ్రమ డిమాండ్లను తీర్చడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, సాంకేతిక నైపుణ్యాలను అందించడానికి ఈ ఐటీఐలు ఎంతగానో తోడ్పాటునందిస్తాయి” అని కేంద్రమంత్రి దృష్టికి వివేక్ తీసుకెళ్లారు. కాగా, తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వివేక్ తెలిపారు. ‘‘త్వరలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.
స్కిల్ యూనివర్సిటీలో కేంద్రం ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో జపాన్, జర్మనీ, ఇతర విదేశీ భాషలు కేంద్రం నేర్పించనున్నది. ఈ భాషల్లో నైపుణ్యం పొందిన వారికి ‘టామ్‌కాం’ సంస్థ.. ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది” అని చెప్పారు.
మాండవీయతోనూ భేటీ..
రామగుండం ఏరియాకు కేటాయించిన ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం పార్లమెంట్‌లో మాండవీయతో వివేక్, ఎంపీ వంశీకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి కోల్ బెల్ట్, రామగుండం ఏరియాకు కేటాయించిన ఈఎస్ఐ హాస్పిటల్‌ను త్వరగా నిర్మించాలని.. ఉప్పల్ ఈఎస్ఐ హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తద్వారా వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. ఈ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై అధికారులతో చర్చించి, పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.